జన నాయగన్ తెలుగు డీల్ సంగతేంటి? రిస్క్ చేసేదెవరు?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఆయన చివరి చిత్రం జన నాయగన్ పైనే నిలిచింది.
By: M Prashanth | 19 May 2026 12:44 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఆయన చివరి చిత్రం జన నాయగన్ పైనే నిలిచింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ భారీ విజయం సాధించడంతో ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే మూవీలకు రిటైర్మెంట్ ప్రకటించిన విజయ్.. జన నాయగన్ తన చివరి చిత్రం అని చెప్పడంతో ఆసక్తి నెలకొంది.
ఇప్పుడు దర్శకుడు హెచ్. వినోత్ తెరకెక్కించిన ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ థియేట్రికల్ డీల్స్ పై చర్చలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. తమిళంలోనే కాకుండా తెలుగు సహా ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. ఇప్పుడు మేకర్స్ పెద్ద ఎత్తున ధరకు రైట్స్ ను కోట్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో అన్ని భాషల్లో డీల్స్ ఫైనల్ అయ్యే దశలో ఉన్నప్పటికీ తెలుగు హక్కుల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని వినికిడి. ఎందుకంటే విజయ్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. గతంలో వచ్చిన అనేక చిత్రాలు ఇక్కడ భారీ వసూళ్లు కూడా సాధించాయి. అందుకే జన నాయగన్ మేకర్స్.. ఇప్పుడు తెలుగు స్టేట్స్ కు హై రేట్ చెబుతున్నారని తెలుస్తోంది.
దీంతో పలువురు తెలుగు డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ పెట్టి సినిమా తీసుకోవడం రిస్క్ అవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. దానికి ప్రధాన కారణంగా జన నాయగన్ కథపై వస్తున్న ప్రచారమే కనిపిస్తోంది. ఆ చిత్రం సీనియర్ హీరో బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ సోల్ ఆధారంగా తెరకెక్కిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా తండ్రీకూతురు భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అదే ఎమోషనల్ లైన్ ను తీసుకుని జన నాయగన్ రూపొందించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది పూర్తి రీమేక్ కాదని, కేవలం సోల్ మాత్రమే తీసుకున్నారని అనిల్ రావిపూడి ఇప్పటికే స్పష్టం చేశారు. తాను రీమేక్‌లపై ఆసక్తి చూపనని, ఇప్పటికే చేసిన కథను మళ్లీ మరో భాషలో తెరకెక్కించడం కంటే కొత్త కథలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు.
దీంతో తమిళ దర్శకుడు హెచ్. వినోత్ ఆ ప్రాజెక్ట్ ను తీసి, తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే భగవంత్ కేసరి ఇప్పటికే తెలుగులో మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో, అదే తరహా భావోద్వేగాలతో వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారా అన్న సందేహం కొందరిలో కనిపిస్తోంది. భారీ రేటుతో హక్కులు తీసుకుంటే రికవరీ సాధ్యమవుతుందా అనే లెక్కలు కూడా వేస్తున్నారట. అందుకే పోటీ ఉన్నప్పటికీ డీల్ ఫైనల్ చేయడంలో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.
ఇక జన నాయగన్ లో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. సీఎం అయిన తర్వాత వస్తున్న విజయ్ సినిమా కావడంతో అంచనాలు ఉన్నా.. తెలుగు డీల్ విషయంలో ఎవరు ముందడుగు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
