విజయ్ 'జన నాయగన్' కి బిగ్ షాక్?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయగన్'.
By: Ravindar Gorantla | 25 March 2026 1:45 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయగన్'. హెచ్ వినోద్ డైరెక్ట్ చేశారు. తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా దీన్ని కొంత మార్పులు చేర్పులు చేసి విజయ్ క్రేజ్‌కి తగ్గట్టుగా రూపొందించారు. జనవరి 9న రిలీజ్ చేయాలని పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. విజయ్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ చేసిన ఆఖరి సినిమా కావడంతో దీనిపై సహజంగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే జనవరి 9న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుందని, తమ ప్రియమైన స్టార్‌కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో గ్రాండ్‌గా ఫెయిర్‌వెల్ ఇవ్వాలని భావించిన వారికి సీబీఎఫ్‌సీ వర్గాలు షాక్ ఇవ్వడం, సినిమా రిలీజ్ వాయిదాపడటం తెలిసిందే. అప్పటి నుంచి ఈ మూవీ రిలీజ్‌పై భిన్నకథనాలు వినిపిస్తున్నా సెన్సార్ వారి నుంచి ఇంత వరకు ఎలాంటి క్లియరెన్స్ రాకపోవడంతో ఇప్పట్లో 'జన నాయగన్' థియేటర్లలోకి రావడం కష్టమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
సెన్సార్ వారికి వ్యతికేకంగా మేకర్స్ చెన్నై హైకోర్టుని సంప్రదించడంతో వివాదం తారా స్థాయికి చేరింది. అయితే తాజాగా వారు సూచించిన కట్స్‌కు టీమ్ అంగీకరించి కేసు విత్‌డ్రా చేసుకోవడంతో సినిమా రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లింది. అయితే తమిళనాడు ఎన్నికలకు నగారా మోగడంతో సెన్సార్ క్లియరెన్స్ ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. అవి పూర్తయిన తరువాతే సెన్సార్ వారు క్లియరెన్స్ ఇచ్చేలా కనిపిస్తోంది.
ఇదే ఇప్పుడు విజయ్ సినిమాకు ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని రూ.121 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కుల్ని రూ.64 కోట్లకు జీ తమిల్ ఛానల్ దక్కించుకుంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల విషయంలోనే ఇప్పుడు అతిపెద్ద షాక్ ఈ సినిమా మేకర్స్‌కు తగలనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ దాదాపు మూడు నెలలుగా వాయిదాపడుతూ వస్తుండటం, ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకపోవడంతో ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో మేకర్స్‌కి షాక్ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు.
సినిమా రిలీజ్‌కు ముందే భారీ డీల్‌ని క్లోజ్ చేసుకునే క్రమంలో అగ్రిమెంట్ చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వర్గాలు ఆ అగ్రిమెంట్‌ని క్యాన్సిల్ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే జరిగితే కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేతకు భారీ స్థాయిలో నష్టాలు రావడం ఖాయమని, ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆయన తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని, ఓటీటీ డీల్ కూడా క్యాన్సిల్ అయితే ఆయన పరిస్థితి మరీ దారుణంగా మారి తెలుగులో మెగాస్టార్‌తో చేయబోతున్న ప్రాజెక్ట్‌పై దాని ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది.
