Begin typing your search above and press return to search.

#జ‌న‌నాయ‌గ‌న్.. ఒకే ఒక్క లేఖతో ఇంతటి క‌ల్లోలం!

దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం `జన నాయగన్` రిలీజ్ డైల‌మా ఇంకా కొన‌సాగ‌తోంది. కోర్టు ప‌రిధిలో ఉన్నందున‌ ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ అంతకంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది.

By:  Sivaji Kontham   |   27 Jan 2026 11:44 PM IST
#జ‌న‌నాయ‌గ‌న్.. ఒకే ఒక్క లేఖతో ఇంతటి క‌ల్లోలం!
X

దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం `జన నాయగన్` రిలీజ్ డైల‌మా ఇంకా కొన‌సాగ‌తోంది. కోర్టు ప‌రిధిలో ఉన్నందున‌ ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ అంతకంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. హైకోర్టులో మ్యాట‌ర్ ఇప్ప‌ట్లో తేలేట్టు క‌నిపించ‌క‌పోవ‌డంతో నిర్మాత స‌హా పంపిణీ వ‌ర్గాల్లో ఆందోళ‌న పెరుగుతోంది. అయితే ఈ వివాదానికి ఆది ఎక్క‌డ ఉంది? అంటే...దీని వెనుక ఉన్న అసలు కారణం ఒకే ఒక్క లేఖ‌..

ఆ లేఖ ఏమిటి? అన్న వివ‌రాల్లోకి వెళితే... జ‌న‌నాయ‌గ‌న్ సెన్సార్ కి వెళ్లిన‌ప్పుడు, సెన్సార్ బోర్డ్ (CBFC) పరిశీలన కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యులలో ఒక సభ్యుడు ఒక లేఖాస్త్రాన్ని సంధించాడు. ఇందులో అత‌డు ఒక బ‌ల‌మైన ఫిర్యాదు చేసాడు. ఆ లేఖలోని విష‌యాల‌ను ప‌రిశీలిస్తే, సినిమాలో భారతీయ సైన్యానికి సంబంధించిన అనేక సన్నివేశాలు ఉన్నాయి. సెన్సార్ నిబంధనల ప్రకారం ఇటువంటి సినిమాలు చూసేటప్పుడు రక్షణ రంగ నిపుణులు ఉండాలి, కానీ ఈ ప్యానెల్‌లో వారు లేరు.

19 డిసెంబర్ 2025న సినిమా చూసినప్పుడు తాను చెప్పిన అభ్యంతరాలను రికార్డు చేయలేదని ఆయన ఆరోపించారు. మిలిటరీ చిహ్నాల వాడకం, మతపరమైన సామరస్యానికి భంగం కలిగించే సన్నివేశాలు ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

తాజాగా జ‌న‌వ‌రి 27న మద్రాస్ హైకోర్టులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని గతంలో ఒక సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ కేసును మళ్ళీ విచారించాలని సింగిల్ జడ్జికే పంపింది. సెన్సార్ బోర్డు తన వాదనను వినిపించడానికి తగిన సమయం ఇవ్వాలని కోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల ఈ వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కావాల్సిన ఈ సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది.

ఫ్యాన్స్ ఆందోళన

విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి (TVK పార్టీ) వెళ్లే ముందు వస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.500 కోట్ల జూదం ఈ సినిమాతో ముడిప‌డి ఉంది. ఈ చిత్రం ఇలా చట్టపరమైన చిక్కుల్లో పడటం వ్యాపార వ‌ర్గాల‌తో పాటు, అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. రాబోయే ఎన్నికల కోడ్ కంటే ముందే సినిమా విడుదల కావాలని వారంతా కోరుకుంటున్నారు.

తదుపరి పరిణామం ప్ర‌కారం.. సింగిల్ జడ్జి ఈ కేసును మళ్ళీ ఎప్పుడు విచారిస్తారో అనే దానిపై సినిమా విడుదల తేదీ ఆధారపడి ఉంది. ఒకవేళ కోర్టు నుండి త్వరగా క్లియరెన్స్ రాకపోతే, నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.