Begin typing your search above and press return to search.

ఎన్నికలైన వెంటనే రిలీజ్‌ అయ్యే పరిస్థితి లేదా..?

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్‌' వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.

By:  Ramesh Palla   |   28 March 2026 10:55 AM IST
ఎన్నికలైన వెంటనే రిలీజ్‌ అయ్యే పరిస్థితి లేదా..?
X

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్‌' వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. గత ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ విజయ్ రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా షూటింగ్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. 2026 సంక్రాంతికి విడుదల చేస్తే విజయ్‌కి రాజకీయంగా అంతో ఇంతో హెల్ప్‌ అవుతుందని భావించారు. సంక్రాంతికి విడుదల కావడం కన్ఫర్మ్‌ అయింది. కానీ సెన్సార్‌ బోర్డ్‌ నుంచి అవాంతరాలు రావడంతో చివరి నిమిషంలో వాయిదా పడింది. సెన్సార్‌ బోర్డ్‌ నుంచి క్లియరెన్స్ కోసం చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ సినిమాకు సెన్సార్‌ నుంచి క్లియరెన్స్‌ రాలేదు. అంతే కాకుండా విజయ్‌ రాజకీయాల్లో ఉన్న కారణంగా ఈ సినిమా విడుదల విషయం పొలిటికల్‌ కలర్‌ను వేసుకుంది. దాంతో సినిమా మరింత వాయిదా పడింది. ఇప్పట్లో సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌...

విజయ్‌ అత్యంత కీలకంగా భావిస్తున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరగబోతున్నాయి. ఆ ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదల అయితే ఆయనకు కలిసి వస్తుందని, అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందనే ఉద్దేశంతో సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయకూడదని ఆదేశాలు వచ్చాయి. దాంతో సినిమా ఎన్నికలు పూర్తయిన తర్వాత అంటే మే నెలలో విడుదల చేస్తారని అంతా భావిస్తున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులతో పాటు, అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఇలాంటి సమయంలో సినిమాను అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేయడం వారికి అసంతృప్తిని కలిగిస్తోంది. మే నెలలో అయినా సినిమా వెంటనే విడుదల అవుతుందా అంటే అది కూడా డౌటే అన్నట్లుగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విడుదల విషయంలో నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు.

విజయ్ చివరి మూవీ జన నాయగన్‌...

'జన నాయగన్‌' సినిమాను నిర్మించిన సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మరో వైపు భారీ సినిమాలు టాక్సిక్‌, కేడీ సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. తాజాగా నిర్మాణ సంస్థ నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం జన నాయగన్‌ సినిమా కంటే ముందు టాక్సిక్‌ మూవీ రాబోతుంది, ఆ తర్వాత కేడీ సినిమాను విడుదల చేసేందుకు గాను వారు రెడీ అవుతున్నారు. ఈ రెండు సినిమాలు విడుదల తర్వాత మాత్రమే జన నాయగన్‌ సినిమాను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అమెజాన్ తో చేసుకున్న ఓటీటీ ఒప్పందం రద్దు అయ్యింది. కనుక విడుదల విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదు. కొత్తగా ఓటీటీ ఒప్పందం చేసుకున్న తర్వాతే కొత్త విడుదల తేదీ విషయంలో నిర్మాణ సంస్థ నుంచి క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అమెజాన్‌ తిరిగి సినిమా ఓటీటీ హక్కులు తీసుకునేందుకు ఆసక్తిగా ఉందా అనేది చూడాలి.

భగవంత్‌ కేసరి సినిమాకు రీమేక్‌..

నందమూరి బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్‌ కేసరి సినిమాకు అనధికారిక రీమేక్‌గా జన నాయగన్‌ రూపొందింది. ఆ విషయం పలు సార్లు వెళ్లడి అయింది. తమిళ నేటివిటీకి తగ్గట్లుగా కథ, కథనంను మార్చి విజయ్‌ యొక్క బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా సినిమాను రూపొందించారని అంటున్నారు. ఇందులో కాస్త పొలిటికల్‌ టచ్‌ కూడా ఉంటుందని, అందుకే సెన్సార్‌ సమస్యలు వచ్చినట్లు చెబుతున్నారు. విజయ్‌ రాజకీయాల్లో లేకుండా ఉంటే ఇప్పటి వరకు జన నాయగన్‌ సినిమా థియేట్రికల్‌ రిలీజ్ అయ్యేది, అలాగే ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ అయ్యి ఉండేది. కేవలం రాజకీయ ఒత్తిడి కారణంగానే ఈ సినిమా విడుదల కాకుండా కొందరు అడ్డుకుంటున్నారు అంటూ విజయ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా వెంటనే విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ రెడీగా లేదు. దాంతో ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు జూన్‌ జులై వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు. ఇంకాస్త ఆలస్యం కూడా కావచ్చు అనేది విశ్లేషకుల మాట.