'జననాయగన్' సెన్సార్.. హైకోర్టు తీర్పుతో కథ మళ్లీ మొదటికి..
కేసును విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్, సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. ఈ స్టేపై అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్మాతలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By: M Prashanth | 27 Jan 2026 12:39 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి లీడ్ రోల్ లో దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన జననాయగన్ సినిమాకు మరోసారి న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ గతంలో మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ రద్దు చేసింది. మొత్తం వ్యవహారాన్ని తిరిగి సింగిల్ బెంచ్ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్తగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్థాయిలో వాదనలు వినిపించుకునే న్యాయపరమైన అవకాశం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపిన నిర్ణయం సరైనదా కాదా అనే అంశాన్ని కూడా సింగిల్ జడ్జి మొత్తంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
ముఖ్యంగా కేసుకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి మరోసారి విచారణ జరిపే పూర్తి అధికారం సింగిల్ బెంచ్ కు ఉందని కోర్టు వెల్లడించింది. వాస్తవానికి జన నాయగన్ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని జనవరి 9న మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
కేసును విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్, సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. ఈ స్టేపై అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్మాతలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఆ అంశంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం, మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ను సంప్రదించాలని నిర్మాతలకు సూచించింది. ఆ మేరకు జనవరి 21న డివిజన్ బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు జరిగాయి.
అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా వెలువడిన ఉత్తర్వుల్లో, గత సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ, ఈ వ్యవహారాన్ని మళ్లీ సింగిల్ బెంచ్ పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జననాయగన్ విడుదల తేదీపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఆ సినిమా, ఇప్పుడు కోర్టు నిర్ణయంపై ఆధారపడి ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విజయ్ అభిమానులు ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జననాయగన్ చిత్రం ఎప్పుడు థియేటర్లకు వస్తుందన్నది ఇంకా స్పష్టత లేదు. సింగిల్ బెంచ్ తీసుకునే తాజా నిర్ణయమే సినిమా ఫ్యూచర్ ను నిర్ణయించనుంది. కెరీర్ లో విజయ్ నటించిన చివరి మూవీ కావడంతో అందరి దృష్టి మూవీపైనే ఉంది. కానీ ఇప్పుడు సెన్సార్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో మరేం జరుగుతుందో వేచి చూడాలి.
