Begin typing your search above and press return to search.

సినిమాను వెంటాడుతున్న భూతం.. పెద్ద‌ సినిమా లీక్‌తో మ‌ళ్లీ టెన్ష‌న్!

ద‌ళ‌ప‌తి విజ‌య్ నటించిన 50వ చిత్రం `జన నాయకన్` థియేటర్లలో విడుదల కాకముందే పూర్తి వెర్షన్ పైరసీ సైట్లలో ప్రత్యక్షం కావడం ఇప్పుడు ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది

By:  Sivaji Kontham   |   10 April 2026 11:10 PM IST
సినిమాను వెంటాడుతున్న భూతం.. పెద్ద‌ సినిమా లీక్‌తో మ‌ళ్లీ టెన్ష‌న్!
X

దక్షిణాది చిత్ర పరిశ్రమలో పైరసీ సమస్య మళ్ళీ ముదిరింది. ద‌ళ‌ప‌తి విజ‌య్ నటించిన 50వ చిత్రం `జన నాయకన్` థియేటర్లలో విడుదల కాకముందే పూర్తి వెర్షన్ పైరసీ సైట్లలో ప్రత్యక్షం కావడం ఇప్పుడు ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. గత కొంతకాలంగా పైరసీని అరికట్టేందుకు చిత్ర బృందాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలాంటి భారీ చిత్రాలు లీక్ అవ్వడం నిర్మాతలను కోట్లాది రూపాయల ఆర్థిక నష్టానికి గురిచేస్తోంది. ఇది కేవలం ఏ ఒక్క సినిమాకో సంబంధించిన‌ సమస్య మాత్రమే కాదు.. మొత్తం సినిమా వ్యవస్థకే ఒక పెద్ద సవాల్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. త‌మిళ్ రాకర్స్ మాఫియా వ్య‌క్తుల అరెస్ట్ ఆ త‌ర్వాత ఐ బొమ్మ సృష్టిక‌ర్త అరెస్ట్ వంటివి పైర‌సీ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయ‌నుకుంటే అది ఇంకా వ‌ట‌వృక్షంలా ఎద‌గ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

విజ‌య్ అనుభ‌వానికి ముందు కూడా.. గతంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు అనేక మంది అగ్ర హీరోలకు ఎదురయ్యాయి. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `అత్తారింటికి దారేది` సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే సగం నిడివి గల చిత్రం ఆన్‌లైన్‌లో రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే విజయ్ దేవరకొండ కెరీర్‌లో `టాక్సీవాలా` సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే లీక్ అయ్యింది. విజువల్ ఎఫెక్ట్స్ , ఎడిటింగ్ పనుల సమయంలో సాంకేతిక లోపాల వల్ల లేదా పని చేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సున్నితమైన డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తోంది.

విజువల్ వండర్ `బాహుబలి` కూడా ఈ లీకేజీ సమస్య నుంచి తప్పించుకోలేకపోయింది. గ్రాఫిక్స్ పనుల కోసం స్టూడియోలకు పంపిన కొన్ని కీలక దృశ్యాలను అక్కడి సిబ్బంది లీక్ చేయడంతో మేకర్స్ తీవ్ర ఆందోళన చెందారు. కేవలం చిన్న సినిమాలు మాత్రమే కాదు.. రజనీకాంత్ నటించిన 2.0, కాలా వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా పైరసీ కోరల్లో చిక్కుకున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ... దాన్ని వాడుకుని సినిమాలను దొంగిలించే ముఠాలు కూడా మరింత బలపడుతుండటం గమనార్హం.

ఈ సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం సినీమాటోగ్రాఫ్ చట్టంలో కఠినమైన మార్పులు తీసుకువచ్చింది. పైరసీకి పాల్పడితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఎంత‌గా క‌ట్ట‌డి చేసినా వెబ్సైట్లు ఒక పేరు మీద మూతపడితే మరో పేరు మీద ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. డిజిటల్ వాటర్ మార్కింగ్ .. క్లౌడ్ సెక్యూరిటీ వంటి సాంకేతికతలను మేకర్స్ వాడుతున్నా.. సినిమా మేకింగ్ ప్రక్రియలో ఎక్కడో ఒకచోట ఉన్న భద్రతా లోపాలు పైరసీదారులకు వరంగా మారుతున్నాయి.

సినిమా అనేది వేలమంది కార్మికుల కష్టం.. వందల కోట్ల పెట్టుబడితో కూడుకున్నది. `జన నాయకన్` వంటి భారీ బ‌డ్జెట్ సినిమాలు లీక్ అయినప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడకుండా పైరసీ కాపీలను ఆదరిస్తే అది పరిశ్రమ మనుగడకే ప్రమాదకరం. ప్రేక్షకులు సామాజిక బాధ్యతతో పైరసీని తిరస్కరించి.. కేవలం అధికారిక వేదికలపైనే సినిమాలను చూసినప్పుడే ఈ భూతాన్ని శాశ్వతంగా అంతం చేయగలం. అయితే చిత్ర పరిశ్రమ కూడా తమ అంతర్గత భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ముందే టికెట్ ధ‌ర‌ల‌ను సామాన్యుల‌కు కూడా అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం అత్యవ‌స‌రం.