జన నాయకన్.. ఇప్పుడు రాకపోతే కష్టమే..
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన కెరీర్‌లో ఆఖరి సినిమాగా చేస్తున్న జన నాయకన్ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 19 Jan 2026 7:00 AM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన కెరీర్‌లో ఆఖరి సినిమాగా చేస్తున్న జన నాయకన్ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తమిళ రాజకీయా సమరానికి ఇప్పటికే సిద్ధమైన విజయ్ ఇదివరకే సినిమాలు చేయనని అన్నారు. దీంతో సినిమాపై బజ్ గట్టిగానే ఉంది. ఇందులో ఉండే డైలాగులు సీన్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని అందరూ ఊహించారు. అయితే, అదే ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వద్ద అడ్డంకిగా మారింది.
ఈ సినిమా విడుదలకు సంబంధించి సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోలేమని చెప్పడంతో, ఇప్పుడు అంతా మద్రాస్ హైకోర్టు వైపు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ కమిటీ సభ్యులలో ఒకరు అంతర్గతంగా ఫిర్యాదు చేయడంతో సర్టిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. సినిమాలో సాయుధ దళాల చిత్రీకరణ అభ్యంతరకరంగా ఉందని, అలాగే కొన్ని సీన్లు పొలిటికల్ గా మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.
ఇప్పుడు అందరి కళ్లు జనవరి 20న జరిగే మద్రాస్ హైకోర్టు విచారణపైనే ఉన్నాయి. ఒకవేళ కోర్టు నుండి సానుకూల తీర్పు వస్తే తప్ప ఈ సినిమా బాక్సాఫీస్ వద్దకు వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ తీర్పు ఆలస్యమైతే మాత్రం విజయ్ సినిమాకు రిలీజ్ డేట్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ కోణంలో సాగే ఈ సినిమాను సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం, జనవరి 30 లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఫిబ్రవరి డేట్లు గనుక మిస్ అయితే, సినిమా నేరుగా జూన్ తర్వాతే థియేటర్లకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులో త్వరలోనే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఇక ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి వస్తే, వివాదాస్పద రాజకీయ అంశాలున్న సినిమాల విడుదలకు రూల్స్ అడ్డంకిగా మారతాయి.
విజయ్ వంటి పెద్ద స్టార్ సినిమా ఐదు నెలల పాటు వాయిదా పడటం అనేది ట్రేడ్ పరంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి. పాలిటిక్స్‌లోకి వెళ్లేముందు విజయ్ ఇచ్చే ఈ 'పొలిటికల్ స్పీచ్' లాంటి సినిమా కోసం ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. హెచ్ వినోద్ మేకింగ్‌లో విజయ్ మార్క్ యాక్షన్ అండ్ మెసేజ్ ఎలా ఉండబోతోందో చూడాలనే క్యూరియసిటీ అందరిలోనూ ఉంది. ఇక జన నాయకన్ విడుదల అనేది ఇప్పుడు పూర్తిగా న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంది. జనవరి 20న వచ్చే క్లారిటీని బట్టి విజయ్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు దండయాత్ర చేస్తారో తేలిపోతుంది. ఈ ఆఖరి పోరాటంలో విజయ్ సెన్సార్ గండాన్ని ఎలా దాటుతారో వేచి చూడాలి.
