జననాయగన్.. క్లైమాక్స్‌కు చేరుకున్న సెన్సార్ వివాదం!
ఇక లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్ ధర్మాసనం ఈ కేసుపై జనవరి 27 (మంగళవారం) తుది తీర్పు ఇవ్వబోతున్నారు.
By: M Prashanth | 25 Jan 2026 11:16 AM ISTతమిళ స్టార్ హీరో విజయ్ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న చివరి సినిమా 'జననాయగన్' రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లకు రావాల్సిన ఈ సినిమా.. సెన్సార్ వివాదాల వల్ల కోర్టు మెట్లు ఎక్కింది. గత కొన్ని వారాలుగా నడుస్తున్న ఈ ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమైంది. మద్రాస్ హైకోర్టు ఈ సినిమా భవితవ్యంపై తుది తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది.
అసలు ఈ వివాదం సెన్సార్ సర్టిఫికెట్ దగ్గర మొదలైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కొన్ని పొలిటికల్ సీన్లు.. డైలాగులపై సెన్సార్ బోర్డు CBFC అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపాలని చైర్మన్ నిర్ణయించడంతో.. నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ జడ్జి ఈ సినిమాకు 'U/A 16+' సర్టిఫికెట్ ఇచ్చి వెంటనే రిలీజ్ చేయాలని ఆర్డర్ వేసినా.. సెన్సార్ బోర్డు ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ అప్పీలుకు వెళ్ళింది.
ఇక లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్ ధర్మాసనం ఈ కేసుపై జనవరి 27 (మంగళవారం) తుది తీర్పు ఇవ్వబోతున్నారు. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు సరైనవేనా లేదా సింగిల్ బెంచ్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లుతుందా అనేది ఆ రోజు తేలిపోనుంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు వస్తున్న సినిమా కావడంతో.. ఈ తీర్పుపై అటు కోలీవుడ్.. ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో భారీ ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో విజయ్ ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా కనిపిస్తున్నారని.. సమాజంలోని లోపాలను ప్రశ్నించేలా డైలాగులు ఉంటాయని టాక్. అందుకే సెన్సార్ బోర్డు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నా.. చట్టపరమైన చిక్కులు దాటి సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాదం వల్ల ఇప్పటికే సంక్రాంతి సీజన్ మిస్ అవ్వడం నిర్మాతలకు పెద్ద దెబ్బ అని చెప్పాలి.
నేటి జనరేషన్ ఆడియన్స్ కూడా ఈ సెన్సార్ గొడవలపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సినిమాలోని కంటెంట్ ప్రభుత్వంపై విమర్శలు చేసేలా ఉందనే కారణంతోనే ఇలా అడ్డుకుంటున్నారని కొందరు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే సెన్సార్ బోర్డు మాత్రం నిబంధనల ప్రకారమే వెళ్తున్నామని చెబుతోంది.
ఏదేమైనా మంగళవారం వచ్చే తీర్పు 'జననాయగన్' రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయబోతోంది. ప్రస్తుతానికి అందరి చూపు మద్రాస్ హైకోర్టు వైపే ఉంది. తీర్పు వచ్చిన వెంటనే ప్రమోషన్లు షురూ చేసి.. వీలైనంత త్వరగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. విజయ్ లాస్ట్ ఫిల్మ్ కాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నా.. ముందు ఈ సెన్సార్ గండం గడవాలి. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
