ఒక్క పోస్టర్‌తో మొత్తం క్లారిటీ ఇచ్చేశారు!
దళపతి విజయ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `జన నాయగన్`. సరికొత్త కథలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న హెచ్.వినోద్ దర్శకుడు.
By: Tupaki Entertainment Desk | 2 Jan 2026 10:08 AM ISTదళపతి విజయ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `జన నాయగన్`. సరికొత్త కథలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న హెచ్.వినోద్ దర్శకుడు. కన్నడంలో పలు విజయవంతమైన చిత్రాలని నిర్మించి ప్రస్తుతం భారీ పాన్ ఇండియా మూవీస్‌ని కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుండగా కథకు కీలకమైన క్యారెక్టర్‌లో `ప్రేమలు`, డ్యూడ్ చిత్రాల ఫేమ్ మమితా బైజు నటిస్తోంది.
ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే వార్తల్లో నిలిచి బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న `జన నాయగన్` రీసెంట్‌గా మలేసియాలోని కౌలాలంపూర్‌లో రిలీజ్ చేసిన ఆడియో వేడుకతో మరో రికార్డుని సొంతం చేసుకుంది. విదేశాల్లో జరిగిన ఆడియో రిలీజ్ చేసిన తొలి సినిమా నిలిచిన `జన నాయగన్` ఈ వేడుకలో 90వేలకు పైగా అభిమానులు పాల్గొనడంతో మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నారు.
తెలుగులో `జన నాయకుడు`గా రిలీజ్ అవుతున్న ఈమూవీపై ప్రారంభం నుంచే ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా రీమేక్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడు హెచ్. వినోద్ మాత్రం అంగీకరించడం లేదు. అందులో నిజం లేదని చెప్పలేనని అంటూనే అది నిజం కాదని, ఇది పూర్తిగా దళపతి విజయ్ సినిమా అన్నాడు. ఇక `భగవంత్ కేసరి`కి దర్శకత్వం వహించి అని రావిపూడిదీ అదే మాట.
ఆది పూర్తిగా దళపతి విజయ్ సినిమా అని చెబుతూనే తనని వారు ఎంత వరకు ఉపయోగించుకున్నారో సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తుందని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దర్శకుడు హెచ్.వినోద్ ఏమో రీమేక్ కాదని చెప్పలేను కానీ ఇది పూర్తిగా విజయ్ సినిమా అంటాడు.. అనిల్ రావిపూడి మాత్రం తనని ఎంత వరకు ఉపయోగించుకున్నారో చూడాలంటాడు. ఈ కన్‌ఫ్యూజన్ స్టేట్‌మెంట్‌లతో ఇద్దరు డైరెక్టర్లు కొంత వరకు ఇది `భగవంత్ కేసరి` రీమేక్ అనే క్లారిటీ ఇచ్చేస్తే తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
జనవరి 9న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుండటంతో మేకర్స్ జనవరి 3న తెలుగు వెర్షన్ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ని షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ గన్ ఫైర్ చేస్తుంటే అదే గన్ పై స్టార్టింగ్‌లో గన్ పట్టుకుని బాబిడియోల్..గన్ ఎడ్జ్‌లో బందీగా కూర్చున్న మమితా బైజు కనిపించింది. దీంతో `జన నాయగన్` తెలుగు హిట్ `భగవంత్ కేసరి` రీమేక్ అని తేలిపోయింది.
రీమేక్ అని ముందే చెప్పేస్తే ప్రేక్షకులలో ఆసక్తి తగ్గిపోతుంది. దాని వల్ల విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఓపెనింగ్స్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అందుకే మేకర్స్ `భగవంత్ కేసరి` కోర్ పాయింట్‌తో ఈ సినిమా చేసినా దాన్ని ఎక్కడా బయటపెట్టకుండా జాగ్రత్తపడుతూ వచ్చాయి. అయితే పోస్టర్స్, ప్రచార చిత్రాలు దాన్ని దాచలేకపోవడంతో అసలు విషయం బయటపడుతోంది. ట్రైలర్ తో మరింత ఓపెన్ అయిపోవడం కాయమనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
