బిగ్ డిబేట్: దళపతి విజయ్ ఫ్యాన్స్ అతి
అతి సర్వత్రా వర్జేయత్! అని అంటారు.. ఏదైనా అతి చేయడం ముప్పు తెస్తుంది. ఇటీవలి కాలంలో ఇలయదళపతి విజయ్ అభిమానులు (రాజకీయ పార్టీ కార్యకర్తలు) చేస్తున్న అతి మామూలుగా లేదు.
By: Sivaji Kontham | 5 Jan 2026 9:38 AM ISTఅతి సర్వత్రా వర్జేయత్! అని అంటారు.. ఏదైనా అతి చేయడం ముప్పు తెస్తుంది. ఇటీవలి కాలంలో ఇలయదళపతి విజయ్ అభిమానులు (రాజకీయ పార్టీ కార్యకర్తలు) చేస్తున్న అతి మామూలుగా లేదు. విజయ్ కరూర్ (తమిళనాడు) పొలిటికల్ ర్యాలీ తొక్కిసలాటలో 40 మంది అమాయక ప్రజలు మరణించిన తర్వాత కూడా ఫ్యానిజం, అతి తగ్గలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న దళపతి విజయ్ తన ఆడియో ఈవెంట్ ని మలేషియా వెళ్లి సంబంధం లేని చోట నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. స్వరాష్ట్రంలో అతడి ఈవెంట్లకు అనుమతించేందుకు కూడా ప్రభుత్వాలు సహకరించని పరిస్థితి.
అయితే సన్నివేశం ఎలా ఉన్నా విజయ్ అభిమానుల వీరంగం మాత్రం ఆగడం లేదు. మలేషియా ఈవెంట్ నుంచి తిరిగి చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టిన తమ నాయకుడు, అభిమాన హీరో అయిన విజయ్ ని నిర్ధాక్షిణ్యంగా వెంటపడి మరీ కిందికి తోసేసారు ఈ వీరాభిమానులు. హద్దుమీరిన హడావుడి, వీరంగంతో ఇంత పని చేసారు.
ఇప్పుడు సంక్రాంతి బరిలో విజయ్ సినిమాతో పోటీపడుతూ శివకార్తికేయన్ సినిమా కూడా విడుదలవుతోంది. ఓవైపు విజయ్ - శివకార్తికేయన్ మంచి స్నేహితులుగా మంచి మాటలు చెబుతున్నారు. ఫ్యాన్స్ నడుమ అనవసర ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకోవాలని కూడా సందేశం ఇచ్చారు. ఇక శివకార్తికేయన్ సినిమా కూడా పండగ బరిలో బాగా ఆడాలని అతడకి శుభాకాంక్షలు కూడా చెప్పారట విజయ్. అయినా ఫ్యాన్స్ కి ఇవేమీ పట్టడం లేదు. ఓ ప్రచార సభకు సమీపంగా ఉన్న శివకార్తికేయన్ పరాశక్తి పోస్టర్లను చించి వేస్తూ విజయ్ ఫ్యాన్స్ దుశ్చర్యలకు పాల్పడిన ఘటన సెల్ ఫోన్లలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియోలు, పోస్టర్లు అంతర్జాలంలో పెద్ద డిబేట్ కి తెర తీసాయి. హీరోలు ఇద్దరూ బాగానే ఉన్నా, ఫ్యాన్స్ అతి చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడితే వీళ్ల ఆగడాలకు హద్దు అన్నదే లేకుండా పోతుందేమో! అనే భయాందోళనలను కూడా వ్యక్తం చేస్తున్నారు. పండుగ సందర్భంగా తమ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇద్దరు నటులు బహిరంగంగా స్నేహభావాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ అభిమానులలోని కొన్ని వర్గాల మధ్య భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో చూపించడం ఆశ్చర్యపరుస్తోంది.
పూర్తిస్థాయి రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' ట్రైలర్ ప్రదర్శన సందర్భంగా మధురైలోని రిట్జీ సినిమాస్ వెలుపల ఉద్రిక్తత చెలరేగింది. విజయ్ అభిమానులు శివకార్తికేయన్ `పరాశక్తి` పోస్టర్లను చించి పక్కకు విసిరేస్తుండగా అభిమానులు కేరింతలు కొట్టడం కనిపించింది. మరికొందరు ఈ సంఘటనను తమ ఫోన్లలో రికార్డ్ చేస్తూ ఆనందించారు. అయితే లైఫ్ లో ఒకే ఒక్క సారి శివకార్తికేయన్ సినిమా విజయ్ సినిమాతో పోటీపడుతోంది. దీనిని కూడా సహించలేకపోతున్నారు అంటూ విజయ్ అభిమానులపై శివకార్తికేయన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. విజయ్ అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరాభిమానుల పిచ్చి ప్రవర్తన ఆన్‌లైన్‌లో విమర్శలకు దారితీసింది.
విజయ్ 'జన నాయగన్' జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. శివకార్తికేయన్ చిత్రం `పరాశక్తి` ఒక రోజు తర్వాత అంటే, జనవరి 10న విడుదల కానుంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయాలని మొదట ప్రణాళిక వేశారు. కానీ వీలుపడలేదు. పరాశక్తిపై భారీగా పెట్టుబడులు పెట్టిన పంపిణీదారులు, బయ్యర్ల డిమాండ్ మేరకు నిర్మాతలు తప్పనిసరి స్థితిలో పండగ బరిలో రిలీజ్ చేయాల్సి వస్తోందని, తాను విజయ్ సర్ సినిమాకి పోటీ వెళ్లకుండా కొత్త తేదీని నిర్ణయించాలని కోరినా, బయ్యర్ల సమస్యను తనకు వివరించి చెప్పారని కూడా శివకార్తికేయన్ నిజాయితీగా వెల్లడించారు. పైగా తమిళనాడు ఎన్నికల కారణంగా సినిమాను 2026 వేసవికి వాయిదా వేయడం కష్టమవుతుంది. విజయ్ సార్‌కు ఇది సమ్మతమేనా అని తెలుసుకోమని ఆయన మేనేజర్ తో కూడా మాట్లాడాను. పండుగ కాబట్టి రెండు సినిమాలు విడుదల కావచ్చని, అది ఏ సినిమా బాక్సాఫీస్‌పై ప్రభావం చూపదని విజయ్ సార్ చెప్పారని మేనేజర్ కూడా తెలిపారు. విజయ్ సార్ తన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. 33 సంవత్సరాలుగా ఆయన మనల్ని అలరిస్తున్నారు. ఇది అన్నదమ్ముల పండగ అనుకోండి! అని శివకార్తికేయన్ అభ్యర్థించాడు.
