నాలుగేళ్ల తర్వాత రౌడీ స్టార్ కోసం...!
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కొత్త సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది.
By: Ramesh Palla | 14 Jun 2026 7:00 AM ISTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, కింగ్‌డమ్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ నిరాశ పరిచిన విషయం తెల్సిందే. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే రణబాలి, రౌడీ జనార్ధన సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. తన భార్య రష్మిక మందన్నతో కలిసి విజయ్ దేవరకొండ చేస్తున్న రణబాలి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక రౌడీ జనార్థన సినిమాతో విజయ్ తనలోని కొత్త యాంగిల్‌ను చూపించబోతున్నట్లుగా ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఈ రెండు సినిమాలు కచ్చితంగా రౌడీ ఫ్యాన్స్‌ను పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలోనే విజయ్ దేవరకొండ మరో సినిమాను కమిట్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో...
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కొత్త సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది. మనం వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించిన విక్రమ్ కుమార్ ఆ తర్వాత 24, హలో, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. 24 టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ హలో, గ్యాంగ్ లీడర్ సినిమాలు నిరాశను మిగిల్చాయి. ఆ తర్వాత వచ్చిన నాగ చైతన్య థాంక్యూ మూవీ పూర్తిగా విఫలం అయ్యింది. అందుకే విక్రమ్ కుమార్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చాడు. దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత విక్రమ్ కుమార్ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గతంలో తాను తీసిన విభిన్న చిత్రాల తరహాలోనే విజయ్ దేవరకొండతో ఒక సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట.
మనం సినిమా తరహాలో విజయ్ దేవరకొండ...
13బి వంటి హర్రర్ సినిమాను తీయడంతో పాటు, ఇష్క్ వంటి లవ్ స్టోరీ, మనం వంటి ఫ్యామిలీ మూవీని తీసిన విక్రమ్ కుమార్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఎలాంటి సినిమాను చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, లవ్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. కనుక విక్రమ్, విజయ్ కాంబోలో రూపొందబోతున్న మూవీ థ్రిల్లర్, హర్రర్ మూవీ అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీరి కాంబో మూవీని బాలీవుడ్‌లో స్త్రీ , మీమీ వంటి సినిమాలను నిర్మించిన మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించబోతుంది. కనుక వీరి కాంబో మూవీ హర్రర్ నేపథ్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి మరో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ్, విక్రమ్ కాంబో మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మూవీ...
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రణబాలి, రౌడీ జనార్థన సినిమాలు ఇదే ఏడాదిలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాదిలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ప్రారంభం అయ్యి, 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండకు కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌తో ఈ సినిమాకు మంచి రీచ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలం గ్యాప్ తీసుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్ ది బెస్ట్ స్క్రిప్ట్ ను రెడీ చేసి ఉంటాడని, విజయ్ దేవరకొండతో చేయబోతున్న సినిమాతో విక్రమ్ కుమార్ సైతం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న హిట్ అందుకునే అవకాశాలు ఉన్నాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి మ్యాడాక్ ఫిల్మ్స్ పూర్తి స్థాయి ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
