300 కోట్ల ప్రాజెక్ట్ వస్తే.. రౌడీ రూల్ నిలబడుతుందా?
అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్న 'రణబలి' ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ చేసిన ఒక కామెంట్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 11 Oct 2026 9:41 AM ISTఅక్టోబర్ 16న రిలీజ్ అవుతున్న 'రణబలి' ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ చేసిన ఒక కామెంట్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో చేస్తే తప్ప భవిష్యత్తులో తన సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉండదని విజయ్ ప్రకటించడంతో ఇది ప్రాక్టికల్ గా సాధ్యమేనా అనే డౌట్ మొదలైంది. కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అద్భుతమైన నిర్ణయమే అయినా, సినిమా వ్యాపార కోణంలో చూస్తే మాత్రం దీని వెనుక చాలా చిక్కులున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి సినిమా టికెట్ రేట్లను ఫైనల్ చేసేది ఎగ్జిబిటర్లు, నిర్మాతలే తప్ప ఇందులో హీరోల జోక్యం చాలా తక్కువే అని ట్రేడ్ పండితులు స్పష్టం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించినప్పుడు, ఆ రికవరీ ఒత్తిడితో ప్రొడ్యూసర్లు కచ్చితంగా రేట్ల పెంపుకే మొగ్గు చూపుతారని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒక స్టార్ హీరో స్టేట్మెంట్ ఇచ్చేసినంత మాత్రాన దశాబ్దాలుగా ఉన్న గ్రౌండ్ లెవెల్ ఎకనామిక్స్ ను ఒకేసారి మార్చేయడం అంత ఈజీ కాదు.
రణబలి స్థాయి బడ్జెట్ తో వస్తున్న సినిమాలకు ఈ నార్మల్ రేట్ల స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అవ్వొచ్చు. కానీ రేపు సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులతో విజయ్ ఒక 300 కోట్ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటే పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. అంత భారీ స్థాయి బడ్జెట్ పెట్టి సినిమా తీసినప్పుడు ఏ నిర్మాత అయినా కామన్ రేట్లతో థియేటర్లలోకి రావడానికి సాహసించలేడు.
వందల కోట్లు రిస్క్ చేసినప్పుడు బయ్యర్లకు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అత్యంత కీలకం. రేట్లు పెంచితే తప్ప ఆ రికవరీ సాధ్యం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు నిర్మాతలు హైక్స్ కావాలని పట్టుబడతారు. అప్పుడు విజయ్ తన పాత స్టేట్మెంట్ కు కట్టుబడి నిర్మాతను ఆపుతాడా.. లేక బిజినెస్ లెక్కలు చూసి సైలెంట్ అవుతాడా అనేది పెద్ద ప్రశ్న.
సరిగ్గా ఈ వ్యవహారంపైనే సోషల్ మీడియాలో నెటిజన్లు మరో లాజిక్ కూడా లేవనెత్తుతున్నారు. రేట్ల పెంపు ఉండొద్దని హీరోలు భావిస్తే, ముందుగా తమ రెమ్యునరేషన్లు తగ్గించుకోవాల్సిందేనని కౌంటర్లు వేస్తున్నారు. సినిమా బడ్జెట్ లో సగానికి పైగా పారితోషికాలకే పోతున్నప్పుడు, ఆ భారాన్ని హీరోలు తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్ లోకి వస్తుందని, అప్పుడు రేట్లు పెంచాల్సిన అవసరమే ప్రొడ్యూసర్లకు రాదని గట్టిగా వాదిస్తున్నారు.
ఇవన్నీ పక్కనపెడితే ఆడియన్స్ పర్స్ కి భారం కాకూడదని విజయ్ ఆలోచించడం కచ్చితంగా అభినందించాల్సిన విషయమే. కానీ ఇండస్ట్రీ అనేది ఎమోషన్స్ తో కాకుండా, కఠినమైన బడ్జెట్ రికవరీ లెక్కలతో నడుస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ 'రౌడీ రూల్' బాక్సాఫీస్ దగ్గర ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే, భవిష్యత్తులో రేట్లు పెంచక తప్పని భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ రూల్ ఫాలో అవుతారా అన్నది చూడాలి.
