Begin typing your search above and press return to search.

విజయ్.. ఇంత మంచి కాంబో ఎలా మిస్సవుతోంది?

Vijay Deverakonda–Sukumar Movie Delay: When Will the Project Begin?

By:  M Prashanth   |   13 Oct 2026 11:01 AM IST
విజయ్.. ఇంత మంచి కాంబో ఎలా మిస్సవుతోంది?
X

విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇప్పుడు బాగా ఉపయోగపడే దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాల్సింది మొన్ననో, నిన్నో కాదు. ఆరేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అప్పట్లో విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ చూపించారు. కానీ ఇన్నేళ్లు గడిచినా సినిమా మొదలుకాలేదు. మధ్యలో సుకుమార్ రేంజ్ మారిపోయింది. విజయ్ కెరీర్‌లోనూ చాలా మార్పులొచ్చాయి. ఇలాంటి సమయంలో ఆ కాంబినేషన్ ఇంకా ఆలస్యమవుతుండటం ఆశ్చర్యమే.

నిజానికి విజయ్‌కు కొత్తగా మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు. 'అర్జున్ రెడ్డి'తోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. 'గీత గోవిందం'లో పూర్తిగా భిన్నమైన పాత్ర చేసి మెప్పించారు. కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో విజయ్ పాత్రల కంటే సినిమా ఫలితాల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ పడితే విజయ్‌కు ఎంత ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక్కడే సుకుమార్ పేరు గుర్తుకొస్తుంది. 'రంగస్థలం'లో చిట్టిబాబు, 'పుష్ప'లో పుష్పరాజ్ పాత్రలను ఎవరు మర్చిపోలేరు. ఇద్దరూ మాస్ హీరోలే అయినా వాళ్ల మాటతీరు, ప్రవర్తన, బలహీనతలు పూర్తిగా వేరు. ముఖ్యంగా హీరోకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఇవ్వడంలో సుకుమార్‌కు మంచి గుర్తింపు ఉంది. విజయ్‌లో ఉన్న అగ్రెసివ్ ఆటిట్యూడ్‌కు అలాంటి రచన తోడైతే మరో కొత్త పాత్ర వచ్చే అవకాశం ఉంటుంది.

2020 సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రకటించినప్పుడు 2022 రిలీజ్ అని కూడా చెప్పారు. 2022 జనవరిలో సుకుమార్ పుట్టినరోజుకు విజయ్ చేసిన ట్వీట్ ఇంకా గుర్తుండే ఉంటుంది. 2021 ది రైజ్, 2022 ది రూల్, 2023 ది ర్యాంపేజ్ అంటూ తమ కాంబినేషన్ గురించి హింట్ ఇచ్చారు. కానీ 2023 కూడా వెళ్లిపోయింది. ఆ తర్వాత సుకుమార్ 'పుష్ప 2' పనుల్లో మునిగిపోయారు. చివరికి ఆ సినిమా 2024 డిసెంబర్‌లో వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా మారింది.

ఇప్పుడు సుకుమార్ రామ్ చరణ్‌తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. 'రంగస్థలం' తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో దీనిపైనా భారీ అంచనాలున్నాయి. షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా పూర్తయ్యే వరకు విజయ్ ప్రాజెక్ట్ మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ ఆలస్యానికి సుకుమార్ ఒక్కరినే కారణంగా చెప్పలేం. విజయ్ కూడా మధ్యలో వరుస సినిమాలు ఒప్పుకుని తన కెరీర్ కొనసాగించారు.

ప్రస్తుతం విజయ్ 'రణబాలి' విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 16న ఈ సినిమా థియేటర్లకు రానుంది. మరోవైపు రవికిరణ్ కోలాతో 'రౌడీ జనార్ధన' చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకత్వంలోనూ ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు. ఇక సుకుమార్‌తో సినిమాను నిర్మించాల్సిన ఫాల్కన్ క్రియేషన్స్ 2021లోనే ప్రాజెక్ట్ ఆగలేదని క్లారిటీ ఇచ్చింది. అప్పటి నుంచి మాత్రం కొత్త అప్డేట్ లేదు. ఇక ఈ కాంబినేషన్ ఎప్పుడు లైన్ లోకి వస్తుందో చూడాలి.