సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.. దేవరకొండ ది గ్రేట్!
తాజాగా ఈ గొప్ప విద్యా కార్యక్రమం తన మొదటి మైలురాయిని విజయవంతంగా చేరుకుంది. ఈ విషయానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసారు.
By: Sivaji Kontham | 14 Jun 2026 12:24 PM ISTసంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆయన మాటిస్టే ఎదురే లేదని నిరూపిస్తూ తన స్వస్థలంలో పేద మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందజేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న విజయ్ దేవరకొండ స్థాపించిన `ది దేవరకొండ ఫౌండేషన్` సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటోంది. సెలబ్రిటీల నేతృత్వంలో నడుస్తున్న సేవా సంస్థల్లో ఇది అత్యంత ప్రభావవంతమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన `మిడిల్ క్లాస్ ఫండ్` దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కాలంలో ఈ ఫౌండేషన్ తన పరిధిని మరింత విస్తృతం చేస్తూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు - సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎంతోమందికి అండగా నిలుస్తోంది.
ఇందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండ - స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కలిసి ఉమ్మడిగా ఒక అద్భుతమైన విద్యా సంబంధిత కార్యక్రమాన్ని ప్రకటించారు. తెలంగాణలోని తమ స్వస్థలం అచ్చంపేట మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించి వారికి రివార్డులు అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. వెనుకబడిన వర్గాల నుంచి వస్తున్న విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి.. వారిలో ఉన్నత చదువులపై మరింత ఆసక్తిని పెంచేందుకు భవిష్యత్తులో వారికి మెరుగైన అవకాశాలు సృష్టించేందుకు ఈ స్టార్ కపుల్ ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
తాజాగా ఈ గొప్ప విద్యా కార్యక్రమం తన మొదటి మైలురాయిని విజయవంతంగా చేరుకుంది. ఈ విషయానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసారు. ఈ వేడుకను జరుపుకోవడానికి విజయ్- రష్మిక మందన్న కలిసి తన తండ్రి స్వగ్రామమైన `తుమ్మన్‌పేట`కు వెళ్లగా అక్కడ ఘన స్వాగతం లభించింది. అచ్చంపేట మండలంలో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 180 మంది విద్యార్థులను ఈ రివార్డుల కోసం ఎంపిక చేసినట్లు దేవరకొండ ఇప్పటికే పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఫ్యాన్స్, నెటిజన్లు వీరిద్దరిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
దేవరకొండ కేవలం వెండితెరపైనే కాకుండా... నిజ జీవితంలోనూ సమాజంపై తమకున్న బాధ్యతను చాటుకుంటూ రియల్ హీరోగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం విజయ్ తీసుకున్న ఈ చొరవ గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారనుంది. విజయ్ దేవరకొండ తన సొంత ఊరి నుంచే ఈ మార్పును ప్రారంభించడం విశేషం. ఈ అద్భుతమైన కార్యక్రమం విజయవంతం కావడంతో ఇటు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. అటు సాధారణ ప్రజల్లోనూ వీరిద్దరిపై ఉన్న గౌరవం, అభిమానం మరింత రెట్టింపయ్యాయి.
ఈ ఆదర్శ జంట సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ తన తదుపరి భారీ చిత్రం `రణబలి` విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు రష్మిక మందన్న కూడా నేషనల్ క్రష్‌గా పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతోంది. ఇలా ఇద్దరి సినీ కెరీర్ విజయవంతంగా దూసుకుపోతున్న తరుణంలోనే సామాజిక సేవా రంగంలో కూడా కలిసికట్టుగా అడుగులు వేస్తూ సమాజంలో స్ఫూర్తిని నింపుతున్నారు.
