Begin typing your search above and press return to search.

సెల్ఫీ కోసం ఆరాటంలో ర‌భ‌స‌.. పెద్ద‌ల‌కు దేవ‌ర‌కొండ హిత‌వు!

అక్కడ పరిస్థితి మరీ అదుపు తప్పుతుండటంతో పిల్లలతో సంతోషంగా గడపాల్సిన తాను చేసేదేమీ లేక ఎంతో బాధతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

By:  Sivaji Kontham   |   14 Jun 2026 1:58 PM IST
సెల్ఫీ కోసం ఆరాటంలో ర‌భ‌స‌.. పెద్ద‌ల‌కు దేవ‌ర‌కొండ హిత‌వు!
X

`ది దేవరకొండ ఫౌండేషన్` ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలతో కలిసి తన తండ్రి స్వగ్రామమైన తుమ్మన్‌పేటకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ స్టార్స్‌ను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈ పర్యటనలో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. అవార్డులు అందుకున్న చిన్న పిల్లలతో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా సెల్ఫీ దిగాలని భావించిన సమయంలో.. అక్కడ ఉన్న కొందరు పెద్దలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంతో వాతావరణం కాస్త గందరగోళంగా మారింది.

ఈ ఇన్సిడెంట్ గురించి విజయ్ దేవరకొండ స్వయంగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము కేవలం చిన్న పిల్లలతో మాత్రమే ఫోటోలు దిగాలని ప్లాన్ చేసుకున్నామని... కానీ ఆ సమయంలో పిల్లల కంటే వారి తల్లిదండ్రులు, పెద్దలే సెల్ఫీల కోసం విపరీతంగా ఎగబడ్డారని తెలిపారు. ఆ క్రమంలో అక్కడ తీవ్రమైన రభస, తోపులాట జరిగిందని.. ఆ తోపులాట వల్ల ఒక మహిళ నియంత్రణ కోల్పోయి కింద పడిపోయారని విజయ్ వివరించారు. అది చూసి తాను ఎంతో ఆందోళనకు గురయ్యానని పేర్కొన్నారు.

వెంటనే స్పందించి ఆ మహిళను పైకి లేపి, నిలబెట్టినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. అక్కడ పరిస్థితి మరీ అదుపు తప్పుతుండటంతో పిల్లలతో సంతోషంగా గడపాల్సిన తాను చేసేదేమీ లేక ఎంతో బాధతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దల ప్రవర్తన వల్లే ఆ కార్యక్రమం అంతటితో ముగించాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులకు, పెద్దలకు విజయ్ ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. పిల్లలు ఎప్పుడూ కూడా తమ తల్లిదండ్రుల ప్రవర్తనను గమనిస్తూ, వారిని రోల్ మోడల్స్‌గా తీసుకుని జీవితంలో అనుసరిస్తారని గుర్తుచేశారు. సమాజంలో పెద్దలు క్రమశిక్షణతో ప్రవర్తించినప్పుడే పిల్లలు కూడా మంచి విషయాలు నేర్చుకుంటారని చెప్తూ... సమాజంలో మీరు పిల్లల ముందు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి.. అని విజయ్ దేవరకొండ హితవు పలికారు.