రష్మిక కోసం విజయ్.. చివరి లైన్ మరీ ఘాటుగా!
ఈ వ్యవహారం మొదలైంది 'కాఫీ విత్ కరణ్' ఇంటర్వ్యూతోనే. పెళ్లి చేసుకుందామని రష్మిక తనను చాలాసార్లు అడిగినట్లు విజయ్ సరదాగా చెప్పడంతో సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వచ్చాయి.
By: M Prashanth | 26 Oct 2026 6:07 PM ISTరష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో తొమ్మిది పేజీల వివరణ ఇచ్చిన కొద్దిసేపటికే విజయ్ దేవరకొండ నుంచి మరో పోస్టు వచ్చింది. అందులో భార్యపై ప్రేమను చూపించడమే కాదు, తమ పెళ్లిపై కామెంట్స్ చేస్తున్నవాళ్లకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. మొదటంతా రొమాంటిక్‌గా సాగిన క్యాప్షన్ చివర్లో మాత్రం ఒక్కసారిగా టోన్ మారింది. ముఖ్యంగా విజయ్ వాడిన చివరి లైన్ సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది. ఆయన పోస్టుకు రెండు గంటల్లోనే దాదాపు పన్నెండు లక్షల లైక్స్ వచ్చాయి.
ఈ వ్యవహారం మొదలైంది 'కాఫీ విత్ కరణ్' ఇంటర్వ్యూతోనే. పెళ్లి చేసుకుందామని రష్మిక తనను చాలాసార్లు అడిగినట్లు విజయ్ సరదాగా చెప్పడంతో సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వచ్చాయి. కొందరు విజయ్ తీరును తప్పుపట్టగా, మరికొందరు రష్మికకు రిలేషన్షిప్ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంటర్వ్యూలోని కొన్ని మాటలతోనే తమ బంధాన్ని అంచనా వేస్తున్నారని రష్మిక అభ్యంతరం తెలిపారు. విజయ్ను విమర్శించిన పోస్టులు కూడా కనిపించాయి.
అందుకే సోమవారం పెద్ద నోట్ పెట్టిన రష్మిక, పెళ్లి నిర్ణయం తీసుకోవడానికి విజయ్ సమయం తీసుకున్న మాట నిజమేనని వివరించారు. తనకు ఏం కావాలో ముందే తెలుసని, ఇద్దరూ ఆలోచించుకున్నాకే ఒక్కటయ్యామని చెప్పారు. కష్టాల్లో తనకు విజయ్ అండగా నిలిచిన సందర్భాలను ప్రస్తావించారు. తమ కుటుంబాన్ని కూడా విమర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె పోస్టులో ప్రశాంతంగా వివరణ ఇచ్చే ప్రయత్నమే ఎక్కువ కనిపించింది.
అయితే విజయ్ పోస్టు మాత్రం మొదటి లైన్ నుంచే మరోలా ఉంది. రష్మికను తన బెస్ట్ ఫ్రెండ్, భార్య, జీవిత భాగస్వామి అంటూ పరిచయం చేశారు. జీవితంలో తాను సరిగ్గా తీసుకున్న అత్యంత అందమైన నిర్ణయాల్లో ఆమె ఒకరని రాశారు. తమ గురించి ఆందోళన పడుతున్నవాళ్లకు ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. ప్రపంచమంతా తమకు వ్యతిరేకంగా నిలబడినా ఇద్దరం కలిసే ఉంటామని స్పష్టం చేశారు. అందులో తన అదృష్టాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అంతవరకు ప్రేమగా సాగిన క్యాప్షన్ చివర్లో ఒక్కసారిగా ఘాటెక్కింది. ప్రేమను గౌరవించే వాళ్లందరికీ అభిమానం తెలిపిన విజయ్, మిగతావాళ్లను ఉద్దేశించి ఇంగ్లీష్‌లో బోల్డ్ పదంతో ఘాటుగా స్పందించారు. మర్యాద ఇచ్చే ఉద్దేశం లేదంటూ అలా రియాక్ట్ అవ్వడం హైలెట్ అయ్యింది. రష్మిక పెద్ద వివరణ ఇచ్చిన కొద్దిసేపటికే విజయ్ నుంచి ఇలాంటి ఘాటు స్పందన రావడంతో ఆ చివరి లైన్ బాగా వైరల్ అయింది. చివర్లో నవ్వుతున్న స్మైలీ కూడా జోడించారు. పోస్టుకు జోడించిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో రష్మిక విజయ్ను ముద్దాడుతూ కనిపించారు. మరో వీడియోలో ఆమెను విజయ్ వీపుపై మోస్తూ సరదాగా ఉన్నారు. ఇదే వీడియోను రష్మిక తన పోస్టులోనూ షేర్ చేశారు.
