బోనాలు స్పెషల్.. డైరెక్టర్ సందీప్ తో అమ్మవారిని దర్శించుకున్న దేవరకొండ బ్రదర్స్!
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను హైదరాబాద్ నగరవాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
By: Madhu Reddy | 9 Aug 2026 1:04 PM ISTప్రస్తుతం హైదరాబాదులో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని, అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అటు సామాన్య ప్రజలే కాదు ఇటు పలువురు సెలబ్రిటీలు కూడా తమకు సమీపంలో ఉన్న అమ్మవారి దేవాలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
అటు మెగా డాటర్ నిహారిక ఏకంగా బంగారుబోనం ఎత్తి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో కలిసి దేవరకొండ బ్రదర్స్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విషయంలోకి వెళ్తే.. బోనాల పండుగ సందర్భంగా విజయ్ దేవరకొండ, తన సోదరుడు ఆనంద్ దేవరకొండ , డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లతో కలిసి హైదరాబాదులోని లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. ఇకపోతే ముగ్గురు కలిసి ఆలయానికి రావడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది.
ఇక విజయ్ దేవరకొండ ఆలయానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. దాంతో అక్కడ వాతావరణం చాలా సందడిగా మారింది. దర్శనం అనంతరం బయటకు వచ్చిన విజయ్ తో ఫోటోలు దిగడానికి , ఆయన ఫోటోలు తీయడానికి అభిమానులు ఎగబడ్డారు.
సాధారణంగా హైదరాబాద్ బోనాల పండుగకు చాలా ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను హైదరాబాద్ నగరవాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ముఖ్యంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి బోనాల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని భక్తులు అమ్మవారి ఆలయానికి వస్తూ ఉంటారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి.. తలపై బోనాలను అలంకరించి తీసుకురావడం, పోతు రాజుల విన్యాసాలు, అమ్మవారి నామస్మరణతో.. డప్పు చప్పుళ్ల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
అందులో భాగంగానే ఇలాంటి ఈ ప్రత్యేకమైన రోజున విజయ్ దేవరకొండ , ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కలసి కనిపించడం, అమ్మవారిని దర్శించుకోవడం, అందుకు సంబంధించిన దృశ్యాలు ,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
