రౌడీ జనార్థన కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ మాసీవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `రౌడీ జనార్థన`. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు.
By: Ravindar Gorantla | 23 April 2026 7:00 AM ISTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ మాసీవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `రౌడీ జనార్థన`. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కీర్తి సురేష్ తొలి సారి విజయ్‌కి జోడీగా నటిస్తుండటం, విజయ్ ఫస్ట్ టైమ్ పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పలికే తూర్పు గోదావరి యాస ప్రధాన హైలైట్‌గా నిలవనుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ అంచనాల్ని పెంచేసింది. 80వ దశకంలో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇది. ఇందు కోసం డిఫరెంట్ మేకోవర్‌తో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. టీజర్‌లో రౌడీ పాత్రలో విజయ్ సరికొత్తగా కనిపించిన తీరు అభిమానుల్ని, సినీ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. రాయలసీమ ప్రాంతంలో జరిగిన ఓ పొలిటికల్ ఎమోషనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రవి కిరణ్ కోలా దీన్ని తెరకెక్కిస్తున్నాడు.
విజయ్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించాలనే పట్టుదలతో దిల్ రాజు ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మే చివర్లో రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించి సాంగ్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ మూవీకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అత్యంత కీలకంగా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్.
ఈ ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించి కేక పెట్టిస్తాడని తెలుస్తోంది. రౌడీలకే రౌడీగా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడం, ఇందులో మునుపెన్నడూ లేనంతగా మాస్ క్యారెక్టర్‌లో విజయ్ దేవరకొండ నటిస్తుండటంతో అభిమానులు, సినీ లవర్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ని పూర్తి చేసి ఇదే ఏడాది డిసెంబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
గత కొంత కాలంగా వరుస ఫ్లాపుల్లో ఉంటూ తనదైన మార్కుని కోల్పోయిన విజయ్ దేవరకొండ ఈ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నాడు. అందుకే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఆ మధ్య విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చేయడంతో మళ్లీ రౌడీ రైజింగ్ అవ్వబోతున్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
