Begin typing your search above and press return to search.

రౌడీ ఇమేజ్‌కు ఫాదర్ సెంటిమెంట్ జత.. జనార్దన లెక్కేంటి?

ఇప్పుడు రౌడీ జనార్దనతో మరోసారి అదే రఫ్ ఇమేజ్‌ను నమ్ముకుంటున్నప్పటికీ.. ఈసారి ఆ మాస్ టచ్‌కు గ్రామీణ వాతావరణం, బలమైన ఎమోషన్‌ను జోడిస్తున్నట్లు కనిపిస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Aug 2026 12:04 PM IST
రౌడీ ఇమేజ్‌కు ఫాదర్ సెంటిమెంట్ జత.. జనార్దన లెక్కేంటి?
X

విజయ్ దేవరకొండ సినిమాల్లో మాస్ యాక్షన్‌కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్, దూకుడైన బాడీ లాంగ్వేజ్, పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో విజయ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రౌడీ జనార్దనతో మరోసారి అదే రఫ్ ఇమేజ్‌ను నమ్ముకుంటున్నప్పటికీ.. ఈసారి ఆ మాస్ టచ్‌కు గ్రామీణ వాతావరణం, బలమైన ఎమోషన్‌ను జోడిస్తున్నట్లు కనిపిస్తోంది.

డైరెక్ట‌ర్ రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ కోనసీమ గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. గ్రామీణ రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలు, స్థానికంగా ఉండే పవర్ గేమ్ చుట్టూ కథనం నడుస్తుండగా.. ఈ ప్రపంచంలోకి విజయ్ పాత్ర ఎంటర్ అవుతుందని సమాచారం. దీంతో ఇప్పటివరకు విజయ్‌ను చూసిన మాస్ ఇమేజ్‌కు పూర్తిగా భిన్నమైన బ్యాక్‌డ్రాప్ కాకపోయినా, ఆ రౌడీ క్యారెక్టర్‌కు పల్లె మాస్‌ను జోడించడం సినిమాకు కొత్త టచ్ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కు కూడా డైరెక్ట‌ర్ సమానమైన ప్రాధాన్యత ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి సెంటిమెంట్ కథలో కీలకమైన భాగంగా ఉండబోతుందట. సాధారణంగా ఒక మాస్ క్యారెక్టర్‌ను ఆడియ‌న్స్ కు మరింత దగ్గర చేయాలంటే కేవలం యాక్షన్ ఎలివేషన్స్ మాత్ర‌మే సరిపోవు. ఆ పాత్ర వెనుక ఉన్న ఎమోష‌న్, బలహీనత, కుటుంబ బంధాలను చూపించడం ద్వారా క్యారెక్టర్‌కు మరింత డెప్త్ వస్తుంది. ఈ యాంగిల్ లో విజయ్ పాత్రకు తండ్రితో ఉన్న అనుబంధం కథలో కీలక మలుపులు తీసుకురావచ్చనే ఆసక్తి ఏర్పడుతోంది.

అంటే రౌడీ జనార్దన కేవలం ఫైట్లు, మాస్ ఎలివేషన్స్‌తో నడిచే సినిమా కాకుండా.. ఒక రఫ్ క్యారెక్టర్ వెనుక ఉన్న ఎమోషనల్ జర్నీని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఒకవైపు కోనసీమ పల్లె నేపథ్యం, మరోవైపు ఆధిపత్య రాజకీయాలు, ఇంకోవైపు తండ్రి సెంటిమెంట్.. వీటన్నింటికీ విజయ్ రౌడీ ఇమేజ్ జత కావడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనుండటం కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మారింది. ఆయన పాత్రకు, విజయ్ పాత్రకు మధ్య ఉండే సంబంధం కథలో ఎలాంటి ఎమోషనల్ ఇంపాక్ట్ తీసుకురాబోతోందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మాస్‌కు పల్లె వాతావరణం, యాక్షన్‌కు ఫ్యామిలీ ఎమోషన్‌ను జత చేస్తూ రౌడీ జనార్దన విజయ్ ఇమేజ్‌ను మరో కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.