విజయ్.. ఆ మూవీ పని మొదలుపెట్టేది అప్పుడేనా?
మంచి అంచనాల మధ్య రిలీజైన ఖుషీ, ఫ్యామిలీ స్టార్ సినిమాలు డిజాస్టర్ టాక్ అందుకోగా.. కింగ్ డమ్ కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు.
By: M Prashanth | 29 Sept 2025 9:00 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న విజయ్.. బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ ను మాత్రం అందుకోలేకపోతున్నారు. మంచి అంచనాల మధ్య రిలీజైన ఖుషీ, ఫ్యామిలీ స్టార్ సినిమాలు డిజాస్టర్ టాక్ అందుకోగా.. కింగ్ డమ్ కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు.
దీంతో ఇప్పుడు మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు విజయ్. గట్టి కమ్ బ్యాక్ ఇచ్చి తానేంటో ప్రూవ్ చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. అయితే విజయ్ లైనప్ లో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రౌడీ జనార్ధన అన్న విషయం తెలిసిందే. రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా ఆ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
డెబ్యూ మూవీని చాలా క్లాస్ గా తీసిన రవి కిరణ్.. ఇప్పుడు విజయ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆ సినిమాను నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 49వ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు.
అయితే ఇప్పుడు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన నిర్వహించనున్నారని సమాచారం. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారట ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని వినికిడి.
ఇక సినిమా విషయానికొస్తే.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రవికిరణ్ కోలా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విజయ్.. శిక్షణ తీసుకుని రాయలసీమ యాసలో మంచి పట్టు సాధించినట్లు సమాచారం. సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ విలన్ గా యాక్ట్ చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అదే నిజమైతే తొలిసారి విజయ్, కీర్తి హీరో హీరోయిన్స్ గా స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పటికే వారిద్దరూ మహానటి మూవీలో కలిసి నటించారు. అందులో కీర్తి సావిత్రిగా కనిపించగా, జర్నలిస్ట్ గా విజయ్ యాక్ట్ చేశారు.
