Begin typing your search above and press return to search.

పెళ్లి దాకా ఆగిన ప్రపోజల్

ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రపోజ్ చేయడం ఏంటని అనిపించొచ్చు. కానీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ స్టోరీలో సరిగ్గా ఇలాంటి ట్విస్ట్ ఉంది.

By:  M Prashanth   |   21 Oct 2026 12:15 PM IST
పెళ్లి దాకా ఆగిన ప్రపోజల్
X

ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రపోజ్ చేయడం ఏంటని అనిపించొచ్చు. కానీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ స్టోరీలో సరిగ్గా ఇలాంటి ట్విస్ట్ ఉంది. పెళ్లికి రెండు నెలల ముందే రష్మికకు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని విజయ్ ప్లాన్ చేశారట. చివరి నిమిషంలో అది కాస్తా ఆగిపోయింది. అసలు ఆ ప్లాన్ ఎందుకు వర్కౌట్ కాలేదో లేటెస్ట్ గా 'కాఫీ విత్ కరణ్' షోలో విజయ్ బయటపెట్టారు.

విజయ్, రష్మిక ప్రేమ వ్యవహారం చాలా కాలం పాటు సీక్రెట్‌గానే సాగింది. ఇద్దరూ కలిసి బయట కనిపించినా రిలేషన్‌షిప్ గురించి పెద్దగా మాట్లాడేవారు కాదు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే పెళ్లికి ముందే తనను పెళ్లి చేసుకోమని రష్మిక చాలాసార్లు అడిగినట్లు విజయ్ సరదాగా చెప్పుకొచ్చారు. దాదాపు ఏడాది పాటు ఆమె నుంచి అదే ప్రశ్న ఎదురైందట. కానీ విజయ్ మాత్రం తనదైన స్టైల్‌లో స్పందించేవారట.

ఇక అసలు ప్రపోజల్ కథలోకి వస్తే.. గత డిసెంబర్‌లో ఇద్దరూ ఇటలీకి వెళ్లారు. అక్కడే రష్మికకు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని విజయ్ అనుకున్నారు. అయితే ఎంత వెతికినా తనకు నచ్చిన ఉంగరం దొరకలేదట. దీంతో ఎంతో ప్లాన్ చేసుకున్న ఆ స్పెషల్ మూమెంట్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి రొమాంటిక్ సర్‌ప్రైజ్‌లు ఇచ్చే అలవాటు తనకు లేకపోయినా, రష్మిక కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావించారట.

చివరకు పెళ్లి వేడుకలే ఆ ప్రపోజల్‌కు వేదికయ్యాయి. ఉదయ్‌పూర్‌లో జరిగిన సంగీత్ కార్యక్రమం ముగిసిన తర్వాత విజయ్ తన స్నేహితులందరినీ ఒకచోటికి పిలిచారు. అందరి ముందు మోకాలిపై కూర్చుని రష్మికకు ఉంగరం ఇచ్చి పెళ్లి ప్రపోజల్ చేశారు. అప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతున్నా, ఆమె జీవితంలో గుర్తుండిపోయేలా ఈ మూమెంట్‌ను ప్లాన్ చేశారు. రష్మికకు అలాంటి ప్రత్యేకమైన అనుభూతి మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు విజయ్ వివరించారు. ఇదే షోలో తమ పెళ్లికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా పంచుకున్నారు. ఉదయ్‌పూర్ వేడుకల్లో అతిథుల ఫోన్ల వాడకంపై ఆంక్షలు పెట్టారట.

అందరూ ఫొటోలు, వీడియోలు తీయడంలో బిజీగా ఉండకుండా పెళ్లిని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెళ్లికి ముందు రష్మికకు ఇచ్చిన ఉంగరం గురించి వచ్చిన సందేహాలకు కూడా ఇద్దరూ సమాధానమిచ్చారు. తమ అసలు ఎంగేజ్‌మెంట్ రింగ్స్‌ను షోలో చూపించారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ జంట ఇప్పుడు మళ్లీ 'రణబాలి' సినిమాలో జంటగా నటించారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి 'కాఫీ విత్ కరణ్' తొమ్మిదో సీజన్‌లో పాల్గొనడం హైలెట్ అయ్యింది.