Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ "రౌడీ బ్రాండ్" రియల్ స్టోరీ ఇదే..

కానీ తాజాగా ఆయన ఈ రౌడీ బ్రాండ్ పెట్టడం వెనక అసలు కథ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

By:  Madhu Reddy   |   19 Sept 2025 10:43 AM IST
విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ రియల్ స్టోరీ ఇదే..
X

ప్రస్తుతకాలంలో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా చాలామంది పరుగులు పెడుతున్నారు. సామాన్యుల విషయం పక్కన పెడితే.. సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతుంది. అందులో భాగంగానే వీరి ఆదాయ మార్గాల విషయానికి వస్తే.. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వ్యాపార రంగాలలో పెట్టుబడులుగా పెట్టి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. కొంతమంది సినిమాల ద్వారా వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెడితే.. మరికొంతమంది బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా చాలామంది హోటల్స్, బట్టల వ్యాపారాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ కూడా సొంత లాభం కోసం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన "రౌడీ బ్రాండ్" వ్యాపారాన్ని ఇలాగే మొదలుపెట్టారని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఆయన ఈ రౌడీ బ్రాండ్ పెట్టడం వెనక అసలు కథ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అసలు విషయంలోకి వెళ్తే.. 90'స్ బయోపిక్ ఫేమ్ మౌళి హీరోగా, శివాని నాగారం హీరోయిన్ గా తాజాగా వచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్ . చిన్న సినిమాగా ఇటీవల విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సక్సెస్ జోరులో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించి గురువారం సాయంత్రం హైదరాబాదులో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ , బండ్ల గణేష్ లాంటి దిగ్గజాలు ముఖ్య అతిథులుగా విచ్చేసి.. తమ అభిప్రాయాలను పంచుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టి సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్న మౌళికి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు.

అందులో భాగంగానే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన రౌడీ బ్రాండ్ స్థాపించడం వెనుక అసలు కారణాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.." నా మొదటి సినిమా 'పెళ్లిచూపులు'. అయితే ఆ సినిమా సమయంలో నా దగ్గర డబ్బులు లేవు. షూటింగ్ కి వెళ్లడానికి సరైన దుస్తులు కూడా లేవు. అలా డబ్బులు లేక సరైన బట్టలు తొడుక్కోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో నా కష్టాలు వర్ణనాతీతం. ఇక అందుకే నాలాగే ఎవరూ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తవారు ఇలా ఇబ్బందులు పడకూడదని.."రౌడీ బ్రాండ్" సంస్థను స్థాపించి, దీని ద్వారా కొత్తవారికి టీ షర్ట్లు ఇస్తున్నాను" అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. మొత్తానికైతే తాను పడ్డ కష్టాలు ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారు పడకూడదు అనే ఒక్క కారణంతోనే ఈ రౌడీ బ్రాండ్ స్థాపించానని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం తమ అభిమాన హీరో ఆలోచనలకు ఫిదా అవుతున్నారు.

విజయ్ దేవరకొండ అప్ కమింగ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్నతో కలిసి ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమా గనుక హిట్ అయితే ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.