MSGకి కోర్టు రక్షణ.. విజయ్ ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆన్ లైన్ రివ్యూలు, రేటింగ్స్ వ్యవహారం చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 11 Jan 2026 6:55 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆన్ లైన్ రివ్యూలు, రేటింగ్స్ వ్యవహారం చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉన్న విషయం తెలిసిందే. ఫేక్ రివ్యూలు, బాట్ రేటింగ్స్ వల్ల సినిమాల బాక్సాఫీస్ ఫలితాలపై ప్రభావం పడుతోందని ఎప్పటికప్పుడు నిర్మాతలు, దర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విషయంలో తీసుకున్న న్యాయపరమైన చర్యలు హాట్ టాపిక్ గా మారాయి.
చిరంజీవి- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఆ సినిమాపై ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫాంలలో నెగిటివ్ రివ్యూలు, ఫేక్ రేటింగ్స్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన న్యాయస్థానం, తాత్కాలికంగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి బుక్ మై షో వంటి టికెటింగ్ పోర్టళ్లలో రేటింగ్స్, రివ్యూలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.
దీంతో బుక్ మై షో తన రేటింగ్, రివ్యూ ఆప్షన్ ను డిజేబుల్ చేసింది. ఇప్పుడు ఆ విషయంపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. ఆ నిర్ణయం తనకు ఒకవైపు సంతోషాన్ని, మరోవైపు బాధను కలిగించిందని ఆయన తెలిపారు. ఫేక్ రివ్యూలు, నెగెటివ్ ప్రచారానికి చెక్ పడితే ఎంతోమంది కష్టం, కలలు, పెట్టుబడులు కాపాడుతాయని పేర్కొన్నారు. అదే సమయంలో సొంత వాళ్లే ఇతరుల ఎదుగుదలను అడ్డుకునేలా ఇలాంటి సమస్యలు సృష్టించడం బాధాకరమని అన్నారు.
మనం బతుకుతూ ఇతరులను కూడా బతికించాలనే ఆలోచన నేటి రోజుల్లో కనుమరుగవుతోందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన డియర్ కామ్రేడ్ మూవీ రిలీజ్ టైమ్ లో ఇలాంటి ఫేక్ రేటింగ్స్, రివ్యూస్ ను తొలిసారిగా గమనించానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను ఎంత చెప్పినా ఎవరూ కూడా పట్టించుకోలేదని మంచి సినిమాను ఎవరూ ఆపలేరని మాత్రమే తనకు సమాధానం చెప్పేవారని అన్నారు.
కానీ తనతో సినిమా చేసే నిర్మాత, దర్శకుడు ఆ సమస్య తీవ్రతను తర్వాత అర్థం చేసుకున్నారని, ఇలాంటి దాడులు చేసే వాళ్లు ఎవరు? వారిని ఎలా ఎదుర్కోవాలి? అనే ప్రశ్నలతో ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపానని వెల్లడించారు. చివరికి ఆ విషయం బహిరంగంగా చర్చకు రావడం, కోర్టు స్థాయిలో గుర్తింపు పొందడం కొంత ఊరటనిస్తోందని చెప్పారు. చిరంజీవి వంటి అగ్ర నటుడి సినిమాకే ఇలాంటి ముప్పు ఉందని కోర్టు గుర్తించడం శుభపరిణామమని విజయ్ వ్యాఖ్యానించారు.
ఇది సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం కాకపోయినా, ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నానని తెలిపారు. సంక్రాంతికి విడుదల కానున్న మన శంకర వరప్రసాద్ గారుతో పాటు అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవ్వాలని విజయ్ దేవరకొండ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
