Begin typing your search above and press return to search.

15 కోట్ల వ్యూస్.. ఇది హిందీ బెల్ట్‌లో విజయ్-ర‌ష్మిక‌ క్రేజ్‌కి నిదర్శనమా?

విజయ్ దేవరకొండ - రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న `రణబాలి` చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Sivaji Kontham   |   6 Oct 2026 9:25 AM IST
15 కోట్ల వ్యూస్.. ఇది హిందీ బెల్ట్‌లో విజయ్-ర‌ష్మిక‌ క్రేజ్‌కి నిదర్శనమా?
X

ఉత్తరాది ప్రేక్షకుల్లో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీడీ సినిమా రిలీజైనా లేదా ఏదైనా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించినా నార్త్ ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ భారీ స్పందన లభిస్తుంటుంది. అయితే తాజాగా తన సతీమణి, కో-స్టార్ రశ్మిక మందన్నతో కలిసి చేసిన ఒక హిందీ పాడ్‌కాస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `రణబాలి` ప్రమోషన్లలో భాగంగా హోస్ట్ శుభాంకర్ మిశ్రాతో వీరు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ క్రేజీ పాడ్‌కాస్ట్ విడుదలైన క్షణం నుంచి రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతూ ఇప్పటివరకు ఏకంగా 150 మిలియన్లకు పైగా (15 కోట్ల మందికి పైగా) వ్యూస్‌ను సాధించింది. ముఖ్యంగా హోస్ట్ శుభాంకర్ మిశ్రా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ పాడ్‌కాస్ట్‌కు వంద మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. అలాగే యూట్యూబ్‌లో కేవలం 24 గంటల్లోనే 5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకోవడంతో పాటు.. ఫేస్‌బుక్‌లోనూ రికార్డులు సృష్టించింది. ర‌క‌ర‌కాల‌ మీమ్ పేజీల రీచ్‌ను కూడా కలుపుకుంటే.. ఈ పాడ్‌కాస్ట్ మొత్తంగా 500 మిలియన్లకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది.

విజ‌య్ ఇమేజ్ ఉత్త‌రాదినా ఎలా పెరుగుతోందో విశ్లేషించాలంటే కాస్త గ‌తంలోకి వెళ్లాలి. హిందీ బెల్ట్‌లో విజయ్ దేవరకొండ స్టామినా ఏపాటిదో `అర్జున్ రెడ్డి` సినిమా నాటి నుంచే ఉత్తరాది ప్రేక్షకులు గుర్తించారు. ఆ సినిమాను హిందీలో `కబీర్ సింగ్`గా రీమేక్ చేయడానికి ముందే ఓటీటీలు స‌హా ర‌క‌ర‌కాల‌ వేదికల ద్వారా నార్త్ ఆడియెన్స్ దానిని చూసి విజయ్ నటనకు ఫిదా అయ్యారు. ఆ తర్వాత `లైగర్` ఫలితం ఎలా ఉన్నా హిందీ ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేందుకు విజయ్ ఎప్పుడూ కొత్త ఐడియాలతోనే ముందుకు వెళుతూనే ఉన్నారు. ప్రకటనలు, పాడ్‌కాస్ట్‌లు, హిందీ ఛానెల్ ఇంటర్వ్యూల ద్వారా అత‌డు తన పాపులారిటీని మరింత పెంచుకుంటూనే ఉన్నారు. తాజాగా రశ్మికతో కలిసి చేసిన ఈ హిందీ పాడ్‌కాస్ట్ ద్వారా నార్త్ మార్కెట్‌లో వీడీకి ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది. దేవ‌ర‌కొండ‌తో పాటు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక కూడా జోడీగా పాడ్ కాస్ట్ లో క‌నిపించ‌డం పెద్ద మైలేజ్ ని ఇచ్చింది. పైగా ఈ జంట పెళ్లి త‌ర్వాత ఇలా క‌నిపించ‌డంతో యూత్ దానిని విప‌రీతంగా వైర‌ల్ చేసారు.

విజయ్ దేవరకొండ - రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న `రణబాలి` చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అక్టోబర్ 16న విజయదశమి పండుగ కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ తరుణంలో ఈ జంట పాల్గొన్న ఫస్ట్ హిందీ పాడ్‌కాస్ట్‌కు వచ్చిన రికార్డు స్థాయి స్పందన సినిమాపై హైప్‌ను మరింత పెంచేసింది.

మొత్తానికి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూతోనే వందలాది మిలియన్ల వ్యూస్ సాధించడం అనేది హిందీ బెల్ట్‌లో విజయ్ దేవరకొండ రేంజ్ ఏంటో నిరూపిస్తోంది. కంటెంట్ బలంతో పాటు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే ఫేస్ వేల్యూ ఉంటే నార్త్ మార్కెట్‌లో ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో దీని ద్వారా మరోసారి రుజువైంది. మరి విడుదలకు ముందే సోషల్ మీడియాని షేక్ చేస్తున్న `రణబాలి` జోడీ పెద్ద తెర‌పై ఎలాంటి మ్యాజిక్ చేసిందో.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. విజ‌య్- ర‌ష్మిక జంట‌గా న‌టించిన ర‌ణ‌బాలి చిత్రానికి రాహుల్ సాంకృత్యాయ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.