Begin typing your search above and press return to search.

విరోష్ హల్దీ పిక్స్ చూశారా?.. వాట్వే మూమెంట్స్..

మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   16 March 2026 11:59 PM IST
విరోష్ హల్దీ పిక్స్ చూశారా?.. వాట్వే మూమెంట్స్..
X

మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌ లోని ఉదయపూర్ లో ఫిబ్రవరి 26న జరిగింది. పెళ్లి అనంతరం తమ వెడ్డింగ్ మెమొరీస్‌ ను ఒక్కొక్కటిగా పంచుకుంటూ వస్తున్న ఆ జంట, తాజాగా హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.




హల్దీ కార్యక్రమం సాధారణంగా పసుపు పూసుకుని మంగళ స్నానాలు చేసే ఫుల్ ఎంజాయ్ చేసే వేడుకగా ఉంటుంది. అయితే విజయ్- రష్మిక హల్దీ మాత్రం కాస్త ప్రత్యేకంగా జరిగిందని తెలుస్తోంది. ఆ వేడుకలో రంగులు, నీళ్లతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ సభ్యులు కలిసి సందడి చేశారు. అందుకే వారి హల్దీ వేడుక హల్దీలా కాకుండా హోలీలా మారిపోయిందని రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంది.




ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. "అది కేవలం హల్దీ వేడుక కాదు, హల్దీతో పాటు హోలీ కూడా జరిగినట్లు అనిపించింది. రంగులు, నీళ్లతో ఎంతగా తడిసిపోయామంటే ఇప్పటికీ నా జుట్టులో ఎరుపు రంగు పూర్తిగా పోలేదు" అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు, ఆ రోజు జరిగిన కొన్ని ఆటల గురించి కూడా ఒక క్యూట్ సీక్రెట్‌ బయటపెట్టింది.




పెళ్లి వేడుకల్లో సాధారణంగా అమ్మాయి తరపు వారు, అబ్బాయి తరపు వారు విడిపోయి పోటీ పడుతుంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వరుడు విజయ్.. రష్మిక టీమ్‌లో చేరిపోయి ఆమె గెలవడానికి సహాయం చేశాడట. "ఆ రోజు జరిగిన అన్ని ఆటల్లో టీమ్ బ్రైడ్ గెలిచింది. ఎందుకంటే విజ్జూ మా టీమ్‌లోనే ఉన్నాడు" అని రష్మిక పేర్కొంది. ఇక విజయ్ కూడా ఆ రోజు జరిగిన సరదా సంఘటనలను గుర్తు చేసుకుంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.




ముందురోజు జరిగిన సంగీత్ వేడుకలో రాత్రంతా సందడి చేసినప్పటికీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ తో కలిసి గడపాలనే ఉత్సాహంతో హల్దీ వేడుకలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆ అల్లరిలో తాను ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న కుర్తా కూడా రంగుల నీళ్లతో పూర్తిగా పాడైపోయిందని నవ్వుతూ చెప్పుకొచ్చారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడం ప్రస్తుతం ట్రెండ్‌ గా మారినా, తన పెళ్లి మాత్రం భారత్ లోనే జరగాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు విజయ్ తెలిపారు.




ప్రకృతి మధ్యలో ఉండే ప్రశాంత వాతావరణం కోసం ఉదయపూర్‌ లోని ఒక ప్రైవేట్ రిసార్డును సెలెక్ట్ చేసుకున్నట్లు వెల్లడించాడు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో కొండలు, పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఆ ప్రదేశం తమ పెళ్లికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చిందని విరోష్ జంట తెలిపింది. ఇది తమ జీవిత ప్రయాణానికి ఒక అందమైన ఆరంభం మాత్రమే అంటూ ముగించింది.

ఇక విరోష్ పెళ్లి ఫోటోలు ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వీరి మ్యారేజ్ కు సంబంధించిన ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్‌ లో ఏకంగా 27 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా షేర్ చేసిన హల్దీ వేడుక ఫోటోలు కూడా అదే స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు ఆ ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. క్యూట్ కపుల్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.