తమిళ నాడి పట్టుకుంటున్న 'రణబాలి'
పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రిలీజ్ చేయడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది.
By: M Prashanth | 14 Oct 2026 4:00 PM ISTపాన్ ఇండియా స్థాయిలో సినిమాను రిలీజ్ చేయడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. కానీ పక్క రాష్ట్రాల ప్రేక్షకులకు ఆ కథను కనెక్ట్ చేయడం మాత్రం చాలా కష్టమైన పని. ముఖ్యంగా తమిళనాట మన హీరోలు మార్కెట్ కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మిగతా భాషల్లో కనెక్ట్ చేసినంత త్వరగా అక్కడి జనాలను ఎట్రాక్ట్ చేయడం కష్టం. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ 'రణబాలి' ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఎంచుకున్న స్ట్రాటజీ మాత్రం కాస్త కొత్తగానే ఉంది.
రెగ్యులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు భిన్నంగా, 'హిస్టారిక్ కన్వర్జేషన్' పేరుతో వాళ్లు ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం హైలెట్. వదిలిన ప్రోమో కోలీవుడ్ ను బలంగా ఆలోచింపజేసేలా ఉంది. ఈ ప్రోమోలో సినిమా ముచ్చట్లు కాకుండా, దేశ చరిత్రను లోతుగా విశ్లేషించడం హైలెట్. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై, ప్రముఖ న్యాయవాది సాయి దీపక్ లాంటి వాళ్లతో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చేసిన చర్చ సినిమా స్థాయిని పెంచేలా ఉంది.
1870ల కాలంలో బ్రిటీషర్లు సృష్టించిన కరువు, ఆ ఆకలి దెబ్బకు కర్నూలు, కడప ప్రాంతాల నుంచి బతికేందుకు వేలాది మంది మద్రాస్ వలస వెళ్లి బకింగ్ హామ్ కెనాల్ పనుల్లో చేరిన చరిత్రను అన్నామలై వివరించిన తీరు రెండు రాష్ట్రాల మధ్య బలమైన ఎమోషనల్ బ్రిడ్జిని క్రియేట్ చేసింది. సాధారణంగా డబ్బింగ్ సినిమాలను తమిళ ప్రేక్షకులు ఓన్ చేసుకోవాలంటే ఆ కథలో వారి నేటివిటీ లేదా యూనివర్సల్ ఎమోషన్ ఉండాలి.
అందుకే రణబాలి మేకర్స్ చాలా తెలివిగా తమ కథలోని చారిత్రక వాస్తవాలను తమిళ మేధావుల ద్వారానే హైలెట్ చేశారు. బ్రిటీష్ పాలనలో సంస్కృతి, జన్యుపరమైన మార్పులు, శారీరక, మానసిక విధ్వంసం లాంటి బరువైన అంశాలను చర్చించడం ద్వారా.. కమర్షియల్ యాక్షన్ చిత్రంగా కాకుండా, ప్రతి భారతీయుడు చూడాల్సిన డాక్యుమెంట్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా చూసుకున్నా ఇదొక డిఫరెంట్ మూవీ. గతంలో 'నోటా', 'డియర్ కామ్రేడ్' లాంటి చిత్రాలతో తమిళంలో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న విజయ్.. ఈసారి తన రౌడీ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా, ఒక చారిత్రక బాధ్యత ఉన్న క్యారెక్టర్ తో వెళ్తున్నాడు. చరిత్ర పుస్తకాల్లో దాగిన చీకటి కోణాలను వెలికితీస్తూ, దేశం ఎదుర్కొన్న అత్యంత దారుణమైన కరువు పరిస్థితులపై కథ ఒకే చేయడం మెచ్చుకోదగ్గ విషయం.
దర్శకుడు రాహుల్ సంకృత్యన్ విజన్ కూడా ఈ ప్రోమోతో కనిపిస్తోంది. చరిత్రలో మిస్సయిన లింకులను తిరిగి కలపడమే రణబాలి ఉద్దేశమని ఆయన చెప్పిన తీరు ఆకట్టుకుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన వల్ల మన మధ్య వచ్చిన అంతరాలు, అంతరించిపోతున్న ట్రెడిషన్స్ లాంటి విషయాలపై జరిగిన ఈ లోతైన చర్చ.. సీరియస్ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాటలు, ఫైట్లతో పాటు ఇలాంటి కల్చరల్ డిబేట్స్ కూడా జనాలను థియేటర్లకు రప్పించే చాన్స్ ఉంటుంది. ప్రోమోలో ప్రామిస్ చేసినట్లుగానే సినిమా కూడా అంత డీప్ ఇంపాక్ట్ తో ఉంటే.. విజయ్ దేవరకొండ ఈసారి తమిళ బాక్సాఫీస్ పై గట్టిగానే తన ముద్ర వేయడం ఖాయం.
