విజయ్ 'రణబాలి'.. ఓవర్సీస్ ప్లాన్ ఎలా ఉందంటే?
విజయ్ దేవరకొండ అభిమానులకు దసరా ట్రీట్ రెడీ అవుతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
By: M Prashanth | 2 Oct 2026 10:29 PM ISTవిజయ్ దేవరకొండ అభిమానులకు దసరా ట్రీట్ రెడీ అవుతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ పై కూడా మేకర్స్ స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. ఇండియాలో సినిమా అక్టోబర్ 16న విడుదల కానుండగా.. విదేశాల్లో మాత్రం ఒక రోజు ముందే సందడి మొదలుకానుంది.
ఓవర్సీస్ లో రణబాలి ప్రీమియర్స్ అక్టోబర్ 15న వేయనున్నారు. అంటే అమెరికాతో పాటు ఇతర కీలక ఫారిన్ మార్కెట్లలో ఉన్న తెలుగు ప్రేక్షకులు ఇండియాలో కంటే ముందుగానే సినిమాను చూసే అవకాశం ఉంది. ఈ మేరకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ టీమ్ రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ ద్వారా ప్రీమియర్ డేట్ ను అనౌన్స్ చేసింది. అమెరికాలో ఆ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమవుతున్నాయి.
అక్టోబర్ 6 నుంచి నార్త్ అమెరికాలో బుకింగ్స్ అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డల్లాస్ మెట్రోతో పాటు ప్రముఖ థియేటర్ చైన్లలో సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ లొకేషన్లలో సినిమాను అందుబాటులోకి తీసుకురావడంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అమెరికాతో పాటు యూకే, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా వంటి మెయిన్ మార్కెట్లలోనూ రణబాలిని గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమా విడుదల కానుండటంతో ఓవర్సీస్ లో మరింత మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా కాస్త డిఫరెంట్ గా సాగుతున్నాయి.
సాధారణంగా సినిమా రిలీజ్‌కు ముందు పాటలు, ట్రైలర్, ఈవెంట్లతో హైప్ పెంచుతుంటారు. కానీ రణబాలి టీమ్ మాత్రం సినిమా కథకు సంబంధించిన హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ‘రణబాలి: నెవర్ ఫర్గెట్ ది ట్రూత్ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్, ది హిస్టరీ వుయ్ ఫర్గాట్, ది మెన్ వుయ్ ఫర్గాట్ పేర్లతో ఎపిసోడ్లు వచ్చాయి.
రాయలసీమ చరిత్ర, అప్పటి కరువు పరిస్థితులు, బ్రిటిష్ పాలన, పోరాట వీరుల గురించి సిరీస్ లో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సినిమా బ్యాక్ డ్రాప్ పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. విజయ్ దేవరకొండ ఇందులో సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న జయమ్మగా నటిస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో సందడి చేయనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇండియాలో అక్టోబర్ 16న విడుదల కానున్న రణబాలికి, ఓవర్సీస్‌లో మాత్రం అక్టోబర్ 15 నుంచే అసలు సందడి మొదలుకానుంది. నార్త్ అమెరికా బుకింగ్స్ కూడా అక్టోబర్ 6 నుంచి మొదలవుతుండటంతో.. ఓవర్సీస్ మార్కెట్ లో విజయ్ సినిమా ఎలాంటి ఓపెనింగ్ తెచ్చుకుంటుందనేది చూడాలి.
