నెక్స్ట్ దేవరకొండ వంతా?
ఈ ఏడాది టాలీవుడ్‌లో చాలాకాలంగా హిట్ కోసం చూస్తున్న కొందరు హీరోలకు ఒక్కొక్కరుగా మంచి రిజల్ట్స్ వచ్చాయి. వరుణ్ తేజ్‌కు ‘కొరియన్ కనకరాజు’ హిట్ ఇచ్చింది.
By: M Prashanth | 24 Aug 2026 10:42 PM ISTఈ ఏడాది టాలీవుడ్‌లో చాలాకాలంగా హిట్ కోసం చూస్తున్న కొందరు హీరోలకు ఒక్కొక్కరుగా మంచి రిజల్ట్స్ వచ్చాయి. వరుణ్ తేజ్‌కు ‘కొరియన్ కనకరాజు’ హిట్ ఇచ్చింది. అఖిల్‌కు ‘లెనిన్’ బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు రవితేజ ‘ఇరుముడి’తో మళ్లీ మంచి ఫామ్‌లోకి వచ్చాడు. ఇలా వరుసగా హిట్ కోసం వెయిట్ చేసిన హీరోలు ట్రాక్‌లోకి వస్తుండటంతో నెక్స్ట్ ఇమిడియేట్‌గా ఫోకస్ విజయ్ దేవరకొండ మీద పడుతోంది.
విజయ్‌కు కూడా చాలా రోజులుగా ఒక గట్టి కమర్షియల్ హిట్ మిస్ అవుతోంది. ‘లైగర్’ పెద్ద దెబ్బ ఇచ్చింది. ‘ఖుషి’ కొంత రిలీఫ్ ఇచ్చినా పూర్తి స్థాయి కమ్‌బ్యాక్ కాలేదు. ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్‌డమ్’ కూడా ఆయనకు కావాల్సిన రిజల్ట్ ఇవ్వలేదు. క్రేజ్ మాత్రం అలాగే ఉంది. కానీ ఇప్పుడు కావాల్సింది పోస్టర్లు, టీజర్ల బజ్ కాదు.. థియేటర్‌లో ఎక్కువ రోజులు నిలిచే సినిమా.
ఆ ఛాన్స్ ‘రణబలి’తో వస్తోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో నడిచే పీరియడ్ యాక్షన్ డ్రామా. విజయ్ ఒక ధైర్యమైన స్వాతంత్ర్య పోరాట యోధుడి పాత్రలో కనిపిస్తున్నాడు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా సర్ థియోడర్ హెక్టర్ పాత్ర చేస్తున్నాడు. అంటే విజయ్ గత సినిమాలతో పోలిస్తే ఇది పూర్తిగా వేరే సెటప్.
రష్మిక మందన్న కూడా ఇందులో జయమ్మగా కనిపిస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌కు ముందే మంచి క్రేజ్ ఉంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత మళ్లీ కలిసి చేస్తున్న సినిమా కావడం ఒక పాయింట్ అయితే, పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి తెరపై కనిపించే మొదటి సినిమా కావడం ఇంకో ప్లస్. ఇప్పటికే విడుదల చేసిన పెళ్లి పోస్టర్ కూడా సోషల్ మీడియాలో బాగా తిరిగింది.
‘రణబలి’లో మరో పెద్ద హైలైట్ క్లైమాక్స్ అని దర్శకుడు ముందే చెప్పాడు. విజయ్ ఆర్నాల్డ్ వోస్లూ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్‌ను 16 రోజుల పాటు షూట్ చేసినట్లు సమాచారం. సినిమా కేవలం పీరియడ్ యాక్షన్ దగ్గర ఆగకుండా ఇంకో లేయర్ కూడా ఉంటుందని ఇదివరకే ఒక టాక్ కూడా వచ్చింది. సెప్టెంబర్ 11న ‘రణబలి’ థియేటర్లలోకి వస్తోంది. వరుణ్, అఖిల్, రవితేజ తర్వాత ఇప్పుడు స్ట్రాంగ్ హిట్ కోసం చూస్తున్న హీరోల్లో రిలీజ్‌కు దగ్గరగా ఉన్న పెద్ద పేరు విజయ్‌దే. పైగా ఈసారి కథ కొత్త జోన్‌లో ఉంది, రష్మిక కాంబినేషన్ ఉంది, పెద్ద విలన్ కూడా ఉన్నాడు. అందుకే విజయ్‌కు ఈ సినిమా మామూలు రిలీజ్ కాదు. చాలా రోజులుగా మిస్ అవుతున్న సాలిడ్ హిట్‌ను ఇప్పుడు ‘రణబలి’ ఇస్తుందా అన్నదే చూడాలి.
