రౌడీ హీరో రెండు పడవల ప్రయాణం
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ మధ్య ఏం చేసినా పెద్దగా కలిసిరావడం లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 26 Sept 2025 5:00 PM ISTటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ మధ్య ఏం చేసినా పెద్దగా కలిసిరావడం లేదు. ఏ సినిమాకు ఆ సినిమా కోసం విజయ్ కష్టపడుతూనే ఉన్నప్పటికీ అతనికి సక్సెస్ మాత్రం దరి చేరడం లేదు. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన కింగ్‌డమ్ సినిమా కూడా అతనికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. కింగ్‌డమ్ మూవీతో విజయ్ సాలిడ్ హిట్ అందుకుని కంబ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు.
రాహుల్ సాంకృత్యన్ తో మరోసారి విజయ్
కానీ కింగ్‌డమ్ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో విజయ్ ఆశలన్నింటినీ తన తర్వాతి సినిమాపైనే పెట్టుకున్నారు. కింగ్‌డమ్ తర్వాత విజయ్, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా నటించిన ట్యాక్సీవాలా మూవీతో డైరెక్టర్ గా పరిచయమైన రాహుల్, ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ తో మరో హిట్ ను అందుకున్నారు.
ఈ నెలాఖరు నుంచి రెండో షెడ్యూల్
ఇప్పుడు రాహుల్ మూడో సినిమాను విజయ్ దేవరకండ హీరోగానే చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లి ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఈ మూవీ రెండో షెడ్యూల్ కు రెడీ అవుతుంది. విజయ్ కెరీర్లో 14వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో మొదలవనున్నట్టు సమాచారం.
అక్టోబర్ 2న విజయ్ కొత్త సినిమా లాంచ్
వీడీ14లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ 1854-78 మధ్య కాలంలో జరిగే కథగా తెలుస్తోంది. వీడీ14 తో పాటూ విజయ్ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. రాజా వారు రాణి గారు, అశోక వనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమా అక్టోబర్ 2న లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ఆ సినిమా షూటింగ్ కూడా మొదలవనుందట. అంటే విజయ్ ఈ రెండు సినిమాలనీ సమాంతరంగా పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్టున్నారు. మరి ఈ రెండు సినిమాలైనా విజయ్ కు మంచి సక్సెస్ ను అందించి, అతని కెరీర్ ను మలుపు తిప్పుతాయేమో చూడాలి.
