సుహాస్ 'మండాడి' తెలుగు ట్రైలర్.. దేవరకొండ బిగ్ బూస్ట్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్.. ఇప్పుడు కోలీవుడ్ లో తన లక్ ను టెస్ట్ చేసుకుంటున్నారు.
By: M Prashanth | 6 Sept 2026 10:32 PM ISTవిభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్.. ఇప్పుడు కోలీవుడ్ లో తన లక్ ను టెస్ట్ చేసుకుంటున్నారు. తమిళ హీరో సూరి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మండాడిలో సుహాస్ విలన్ గా కనిపించనున్నారు. తాజాగా ఆ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.
విజయ్ దేవరకొండ, సుహాస్ కు మధ్య ఉన్న రిలేషన్ కొత్తది కాదు. ఇద్దరూ 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా సుహాస్ కనిపించారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. సుహాస్ హీరోగా పరిచయమైన కలర్ ఫోటో మూవీకి కూడా విజయ్ దేవరకొండ తనవంతుగా మద్దతు ఇచ్చారు. ఆ సినిమా టీజర్ ను విడుదల చేసి సుహాస్ ను ప్రోత్సహించారు.
ఇప్పుడు సుహాస్ కెరీర్ లో మరో కీలక అడుగు వేస్తున్న సమయంలోనూ విజయ్ సపోర్ట్ చేస్తున్నారు. మండాడి తెలుగు ట్రైలర్ ను షేర్ చేస్తూ.. చాయ్ బిస్కెట్ లో ప్రమోషనల్ వీడియోలు చేసే రేంజ్ నుంచి షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో నటిస్తూ హీరోగా ఎదిగిన సుహాస్ జర్నీ గుర్తుచేశారు. ఇప్పుడు మరో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నందుకు గర్వంగా ఉందంటూ విషెస్ తెలిపారు. దీంతో విజయ్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక మండాడి సినిమా విషయానికి వస్తే.. తమిళనాడు తీర ప్రాంతాల్లో జరిగే సాంప్రదాయ పడవ పందేల నేపథ్యంలో మూవీ కథ సాగుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సముద్రం, పడవ పోటీలు, యాక్షన్ సన్నివేశాలతో సినిమాను హైవోల్టేజ్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హీరో సూరికి దీటుగా సుహాస్ విలన్ గా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సెల్ఫీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మతిమారన్ పుగళేంది మండాడికి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సూరి సరసన మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, బాల శరవణన్ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సుహాస్ కూడా సినిమా కోసం ప్రత్యేకంగా కష్టపడ్డట్లు తెలుస్తోంది. సముద్రంలో జరిగే యాక్షన్ సీన్స్, పడవ పందేల సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించినట్లు మూవీ టీమ్ చెబుతోంది.
దీంతో మండాడి సుహాస్ కు కేవలం మరో సినిమా కాకుండా.. కోలీవుడ్ లో తన యాక్టింగ్ ను పరిచయం చేసే కీలక చిత్రంగా మారుతోంది. సెప్టెంబర్ 10న మండాడి ప్రేక్షకుల ముందుకు రానుండగా, సుహాస్ ను విలన్ గా ఎలా చూపించారు? సూరితో ఆయన ఢీ ఎలా ఉండబోతోంది? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ ఇచ్చిన బూస్ట్.. సుహాస్ కొత్త జర్నీకి మరింత హైప్ తీసుకొచ్చిందనే చెప్పాలి.
