2026లో రౌడీ దర్శనం లేనట్లేనా?
విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ మూవీ కోసం తన అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. గీత గోవిందం విజయ్ చివరి క్లీన్ హిట్. ఆ తర్వాత తన సినిమాలన్నీ నిరాశపరిచాయి.
By: Garuda Media | 18 Aug 2026 12:00 AM ISTవిజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ మూవీ కోసం తన అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. గీత గోవిందం విజయ్ చివరి క్లీన్ హిట్. ఆ తర్వాత తన సినిమాలన్నీ నిరాశపరిచాయి. గత ఏడాది వచ్చిన ‘కింగ్డమ్’తో బలంగా పుంజుకుంటాడనే అంచనాలు కలిగాయి కానీ.. అది నిజం కాలేదు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడి వెళ్లిపోయింది.
ఐతే విజయ్‌కి ఉన్న అదృష్టం ఏంటంటే.. ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా తన ఫాలోయింగ్, మార్కెట్ అలాగే కొనసాగుతున్నాయి. క్రేజీ ప్రాజెక్టులు తన చెంతకు వస్తున్నాయి. గత ఏడాది అతను ఒకేసారి రెండు భారీ చిత్రాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి రణబాలి కాగా.. ఇంకోటి రౌడీ జనార్ధన. వీటిలో మొదటిది సెప్టెంబరులో, రెండోది డిసెంబర్లో రిలీజ్ కావాల్సింది. రెంటికీ రిలీజ్ డేట్లు కూడా ఇచ్చారు. కానీ ఈ రెండూ అనుకున్నట్లుగా విడుదల కావట్లేదు.
‘రణబాలి’ వాయిదా అని ఇంతకుముందే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ‘రౌడీ జనార్ధన’ సైతం డిసెంబరులో రిలీజ్ కాదని తెలుస్తోంది. ‘రణబాలి’ ముందే ఆలస్యం కాగా.. హీరోయిన్ రష్మిక మందన్నా గాయంతో మరింత లేట్ అవుతోంది. ఈ సినిమా షూట్ ఇంకా 30 శాతం దాకా మిగిలి ఉన్నట్లు సమాచారం. మరోవైపు ‘రౌడీ జనార్ధన’ వర్క్ 50 శాతం దాకా బ్యాలెన్స్ ఉందట. ఈ రెంటిలో ఏదీ ఈ ఏడాదిలో పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు లేదు. కాబట్టి రౌడీ దర్శనం కోసం 2027 వరకు ఎదురు చూడాల్సిందే.
ఐతే వచ్చే ఏడాది ఈ రెంటితో పాటు మరో చిత్రంతోనూ విజయ్ ప్రేక్షకులను పలకరించే అవకాశముంది. రణబాలి, రౌడీ జనార్ధన వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే రిలీజ్ అవుతాయి. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్‌తో అనౌన్స్ చేసిన సినిమాను సెకండాఫ్‌లో ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశముంది. కాబట్టి ఈ ఏడాది సినిమా లేకపోయినా.. వచ్చే ఏడాది విజయ్ అభిమానులను మూడు చిత్రాలతో మురిపించే ఛాన్సుంది.
