'రౌడీ జనార్ధన' మెయిన్ మ్యాటర్ ఏంటంటే...!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని నటించి, ఆ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
By: Ramesh Palla | 13 Oct 2025 11:12 AM ISTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని నటించి, ఆ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ సినిమాకు సెకండ్ పార్ట్ రావాల్సి ఉంది. కానీ మొదటి పార్ట్ ఫలితం కారణంగా రెండో పార్ట్ ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కింగ్‌డమ్ నుంచి బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పటికే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా దిల్ రాజు బ్యానర్‌లో చాలా రోజులుగా వాయిదాలు పడుతు వస్తున్న రవి కిరణ్ కోలా మూవీ ప్రారంభం అయింది. విజయ్ దేవరకొండ, దిల్ రాజు ఈ సినిమాపై చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమా నిరాశ పరచినా, మరోసారి రవి కిరణ్ కోలా దర్శకత్వంలో చేయనుండటం విశేషం. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు బ్యానర్‌లో...
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పీరియాడిక్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ద్వారా సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది, రాహుల్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను భిన్నమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో టాక్సీవాలా సినిమా వచ్చింది. సినిమాకు పాజిటివ్ స్పందన దక్కింది. దాంతో వీరి కాంబోలో మూవీ అనగానే అంచనాలు పెరుగుతున్నాయి. ఇక రవి కిరణ్ కోలా సినిమా విషయానికి వస్తే అందరి అంచనాలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా ఈ సినిమా ఉండబోతుందట. అంతే కాకుండా మంచి ఫాదర్ సెంటిమెంట్‌ను దర్శకుడు రవి కిరణ్ కోలా చూపించబోతున్నారని చెబుతున్నారు.
రౌడీ జనార్ధన సినిమా బ్యాక్‌డ్రాప్
ఈ మధ్య కాలంలో ఫాదర్ సెంటిమెంట్ సినిమాలకు మంచి ఆధరణ లభిస్తుంది. అందుకే ఈ సినిమా విషయంలో మేకర్స్ నమ్మకంగా కనిపిస్తున్నారు. ఆకట్టుకునే విధంగా కథ, కథనం ఉంటే ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలా కాంబోలో రూపొందుతున్న 'రౌడీ జనార్ధన' సినిమా విషయంలో పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. మేకర్స్ సైతం సినిమాకు మొదటి నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే విధంగా సింపుల్ పబ్లిసిటీ చేస్తూ వెళ్లాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. హీరో విజయ్ దేవరకొండతో పాటు, హీరోయిన్ కీర్తి సురేష్ సైతం ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్
మొత్తానికి వచ్చే ఏడాదిలో విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న ఈ రెండు సినిమాలు ఆయన స్థాయిని, స్టార్‌డంను పెంచే విధంగా ఉంటాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. విజయ్ దేవరకొండ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ వివాహ నిశ్చితార్థం అయిందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే అదే నిజం అయితే విజయ్ దేవరకొండ వివాహం 2026లో ఉండటం ఖాయం. కనుక పెళ్లి తర్వాత లేదా పెళ్లికి అటు ఇటుగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కనుక విజయ్ లైఫ్ లోకి రష్మిక మందన వచ్చిన తర్వాత ఆయన సినీ కెరీర్ ఎలాంటి పలితాలను అందుకుంటుందో అనేది చూడాలి. ఇక రష్మిక మందన్న ఫుల్ బిజీగా చేతిలో మూడు నాలుగు సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న విషయం తెల్సిందే.
