విజయ్ కు ఐబొమ్మ వార్నింగ్.. అదంతా నిజమే..
దీంతో లీకైనప్పుడు ఐబొమ్మకు మేకర్స్ వార్నింగ్ ఇవ్వాలి కానీ.. హీరోకు ఎందుకు వార్నింగ్ ఇచ్చిందేంటని అంతా మాట్లాడుకున్నారు.
By: M Prashanth | 30 Nov 2025 12:18 PM IST'మా మీద ఫోకస్ చేస్తే.. మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని.. ఎప్పుడో చెప్పాం..' పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ వార్నింగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ రిలీజ్ అయిన ఒక్క రోజులోనే పైరసీ భూతానికి బలైంది. సినిమా హెచ్ డీ ప్రింట్.. నెట్టింట లీక్ అయింది.
దీంతో లీకైనప్పుడు ఐబొమ్మకు మేకర్స్ వార్నింగ్ ఇవ్వాలి కానీ.. హీరోకు ఎందుకు వార్నింగ్ ఇచ్చిందేంటని అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఐబొమ్మ ఇచ్చిన వార్నింగ్ విషయంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పైరసీ కేసుల్లో అరెస్ట్ అవ్వగా.. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
రవి పోలీసు కస్టడీ శనివారంతో ముగియగా.. పోలీసుల విచారణలో వాంగ్మూలం ఇచ్చాడు. ఆ సమయంలో విజయ్ దేవరకొండకు ఇచ్చిన వార్నింగ్ విషయం కోసం మాట్లాడాడు. అప్పట్లో ఇచ్చిన హెచ్చరికను పోలీసుల ఎదుట బయటపెట్టాడు. దాన్ని పోలీసులు ఇప్పుడు రివీల్ చేశారు. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"మా మీద ఫోకస్ చేస్తే.. మేం మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని మా టీమ్ ముందే చెప్పింది. కానీ మీరు వినలేదు. ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తొక్కేస్తున్నారు. మా పేరుతో ఐ బొమ్మ ఎఫ్ ఎఫ్ డాట్ ఇన్ పేరుతో రన్ చేస్తున్నారు అందుకే మీ కింగ్ డమ్ సినిమా బయటకు తెస్తాం" అని రవి అప్పుడు వార్నింగ్ ఇచ్చినట్టు పోలీసులు బహిర్గతం చేసిన ప్రకటనలో ఉంది.
నిజానికి.. విజయ్ కింగ్ డమ్ సినిమా చేసిన ముందు ఖుషీ మూవీ చేశారు. 2023లో ఆ చిత్రం విడుదల అవ్వగా.. థియేటర్స్ లో ఫస్ట్ షో పడిన కొన్ని నిమిషాలకే ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. దీంతో పైరసీని అడ్డుకునేందుకు విజయ్ చర్యలు చేపట్టారు. అందుకే ఆయనను వార్నింగ్ ఇస్తూ.. ఐబొమ్మ వెబ్ సైట్ లో ప్రకటన పెట్టినట్లు రవి అంగీకరించారు.
అయితే ఐబొమ్మ అప్పుడు స్టేట్మెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేసిందా లేదా.. మరేదైనా ఫేక్ సైట్ చేసిందా అనేది అప్పుడు కొందరు అనుమానపడ్డారు. నిజమేనా అని చర్చించుకున్నారు. ఒక పైరసీ సైట్ నిర్మాతలకు వార్నింగ్ ఇవ్వడం అప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ విషయంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. తానే వార్నింగ్ ఇచ్చినట్లు రవి ఒప్పుకున్నాడు.
