టాలీవుడ్ లో ఎవరూ ఊహించని కాంబినేషన్
ఆ కాంబినేషన్ మరేదో కాదు, హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా.
By: Sravani Lakshmi Srungarapu | 10 Aug 2025 10:30 AM ISTఇండస్ట్రీలో ఎవరూ ఊహించని కాంబినేషన్లు జరగడం మామూలే. అసలు సాధ్యం కావనుకునే కాంబినేషన్లలో కూడా సినిమాలు కుదురుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి ఓ కాంబినేషనే సెట్స్ పైకి వెళ్లనుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ మరేదో కాదు, హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా.
అయితే మొదటి నుంచి కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ కు, సితార సంస్థకు మధ్య చెప్పుకోదగ్గ బాండింగ్ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఓ డిస్కషన్ లో సినిమా చేస్తా కానీ హారిక హాసినీ క్రియేషన్స్ లో అయితేనే చేస్తా, సితార లో కాదని హరీష్ చెప్పారని కూడా టాక్ ఉంది. దానికి తోడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సితార సంస్థ అధినేత నాగవంశీ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాపై కామెంట్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే.
త్రివిక్రమ్- హరీష్ కు మధ్య కుదిరిన స్నేహం
దీంతో అసలు ఫ్యూచర్ లో కూడా హరీష్, నాగవంశీ కాంబినేషన్ లో సినిమా ఉండదనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఈ కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందంటున్నారు. గత కొన్నాళ్లుగా హరీష్ శంకర్ కు, డైరెక్టర్ త్రివిక్రమ్ కు బాగా ఫ్రెండ్‌షిప్ కుదిరిందని, అందులో భాగంగానే హరీష్ శంకర్ సితార సంస్థలో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.
ఉస్తాద్ భగత్‌సింగ్ తో హరీష్ బిజీ
సితార బ్యానర్‌తో కలిసి త్రివిక్రమ్ భార్య సౌజన్య ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్న విషయం అందరికీ తెలుసు. పైగా హారికా హాసినీలో త్రివిక్రమ్ సినిమాలు తప్ప మరో సినిమాలు చేయడం లేదనేది తెలిసిన విషయమే. అందుకే ఈ కాంబినేషన్ ను సితారతో సెట్ చేశారట త్రివిక్రమ్. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పరుగులు పెట్టిస్తున్న హరీష్ శంకర్ ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమా విజయ్ దేవరకొండతో సితార బ్యానర్ లోనే అని సమాచారం.
విజయ్ ఖాతాలో రెండు సినిమాలు
ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే రీసెంట్ గానే కింగ్‌డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రాహుల్ సాంకృత్యన్ తో సినిమా మరియు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా. మరి ఈ రెండు సినిమాల తర్వాత విజయ్, హరీష్ సినిమాను చేస్తాడా లేదా ఆ సినిమాలు చేస్తూనే ఈ సినిమా కూడా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
