Begin typing your search above and press return to search.

ఎపిక్.. మళ్లీ సెంటిమెంట్‌తో కొట్టిన విజయ్!

విజయ్ దేవరకొండ స్టేజ్ ఎక్కితే పెద్ద పెద్ద డైలాగ్స్ కంటే, నార్మల్‌గా మాట్లాడే మాటలే ఎక్కువగా జనాలకు చేరుతుంటాయి.

By:  M Prashanth   |   9 Sept 2026 9:32 AM IST
ఎపిక్.. మళ్లీ సెంటిమెంట్‌తో కొట్టిన విజయ్!
X

విజయ్ దేవరకొండ స్టేజ్ ఎక్కితే పెద్ద పెద్ద డైలాగ్స్ కంటే, నార్మల్‌గా మాట్లాడే మాటలే ఎక్కువగా జనాలకు చేరుతుంటాయి. ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా అదే జరిగింది. తమ్ముడు ఆనంద్ గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు తాను ఏం చేసినా తన వెనకే వచ్చేవాడని గుర్తు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆనంద్ తనకంటూ ఒక దారి, ఒక ఫిల్మోగ్రఫీ తయారు చేసుకున్నాడని చెప్పాడు. అన్నగా చెప్పిన ఈ చిన్న మాటే స్పీచ్‌లో బాగా కనెక్ట్ అయింది.

విజయ్ స్టార్ అయిన తర్వాత ఆనంద్ సినిమాల్లోకి వచ్చాడు. దీంతో మొదటి నుంచి విజయ్ తమ్ముడు అనే గుర్తింపు అతని వెంట ఉండటం సహజం. కానీ ఆనంద్ మాత్రం అదే ఇమేజ్ మీద కెరీర్ నడపలేదు. దొరసాని నుంచి బేబీ వరకు తనకు నచ్చిన కథలు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎపిక్ కూడా అదే లైన్‌లో ఉంది. విజయ్ కూడా స్టేజ్ మీద తమ్ముడిని తనతో పోల్చకుండా, అతను ఎంచుకున్న దారినే మాట్లాడటం ఇక్కడ బాగుంది.

విజయ్ స్పీచ్‌లు యువతకు త్వరగా కనెక్ట్ అవడానికి ఇదే ఒక కారణం. సినిమా ఈవెంట్ అంటే రాసుకొచ్చిన మాటలు, హీరోను పొగిడే లైన్స్ కాకుండా తన జీవితంలో జరిగిన చిన్న విషయాలను తీసుకొస్తాడు. ఫెయిల్యూర్స్ గురించి అయినా, కుటుంబం గురించి అయినా, కెరీర్ గురించి అయినా మాట్లాడే భాష చాలా క్యాజువల్‌గా ఉంటుంది.

తన కెరీర్ గురించి చెప్పిన మరో మాట కూడా అదే టోన్‌లో వచ్చింది. తాను ఎంత పెద్ద స్థాయికి వెళ్తానన్నదానికంటే, తనను చూసి ఇంకొకరికి నేను కూడా చేయగలను అనే నమ్మకం వస్తే అదే ముఖ్యమని విజయ్ చెప్పాడు. అర్జున్ రెడ్డి టైమ్ నుంచి తనలో ఆ ఆలోచన ఉందని గుర్తు చేశాడు. ఇలాంటి లైన్స్‌లోనే విజయ్ స్పీచ్‌కు నేటి జనరేషన్‌తో ఉన్న కనెక్షన్ కనిపిస్తుంది.

ఆదిత్య హాసన్ గురించి మాట్లాడినప్పుడు కూడా పర్సనల్ కనెక్షన్ నుంచే మొదలుపెట్టాడు. 90స్ చూడటానికి ప్రత్యేకంగా యాప్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నానని, అప్పుడే ఆదిత్య సినిమా వస్తే చూడాలని అనుకున్నానని చెప్పాడు. వైష్ణవి చైతన్య గురించి కూడా టాలెంటెడ్ నటి అంటూ చిన్నగా మాట్లాడాడు. ఎవరినీ అవసరానికి మించి పొగడకుండా, తనకు వాళ్లతో ఉన్న కనెక్షన్ ఏంటో చెప్పుకుంటూ వెళ్లాడు.

అన్నదమ్ముల సినిమా ఈవెంట్ అంటే క్రేజ్ మొత్తం స్టార్ బ్రదర్ తో హైలెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఆనంద్ గురించి మాట్లాడిన విధానం వేరుగా ఉంది. చిన్నప్పుడు తన వెనక తిరిగిన తమ్ముడు ఇప్పుడు తనకు నచ్చిన సినిమాలు ఎంచుకునే హీరో అయ్యాడని విజయ్ చెప్పడం, ఆనంద్‌కు వచ్చిన మార్పును ఒక్క లైన్‌లో చెప్పేసింది. ఎపిక్ రిలీజ్‌ ప్రమోషన్స్‌లో ఈ అన్నదమ్ముల మాట మాత్రం బాగా హైలెట్ అయ్యింది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.