ఈడీ విచారణకు హాజరైన రౌడీ హీరో!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన మొత్తం 29 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 6 Aug 2025 12:00 PM ISTబెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన మొత్తం 29 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలను మొదలుకొని ప్రముఖ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కూడా సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. ఇప్పటికే ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ కూడా తెలిపారు.
అయితే ఈరోజు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఈడీ విచారణ ముందు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈడి విచారణ అనంతరం ఆయన ఏం చెప్పబోతున్నారు అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి అటు హీరో దగ్గుబాటి రానాకి కూడా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలి అని నోటీసులు జారీ చేశారు. అలాగే మంచు లక్ష్మికి కూడా ఆగస్టు 13న విచారణకు రావాలి అని నోటీసులు జారీ చేయడం జరిగింది.
ఇకపోతే ఈ విచారణలో ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడానికి వాటి నుంచి ఎంత పారితోషకం తీసుకున్నారు? చట్ట విరుద్ధమైన ఈ యాప్ లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది ? మనీ లాండరింగ్ కోణంలో కూడా అధికారులు విజయ్ దేవరకొండను ప్రశ్నించనున్నారు. అంతేకాదు ఈడి విచారణకు హాజరయ్యే ముందు బెట్టింగ్ యాప్స్ తో జరిపిన లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ను కూడా తీసుకురావాలి అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరి ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ విచారణ అనంతరం ఎలాంటి సమాధానం తెలియజేస్తారో చూడాలి.
ఇదిలా ఉండగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో.. ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ , అనన్య నాగళ్ళ , శ్రీముఖి, దివి వంటి వారితోపాటు.. సిరి హనుమంతు, నీతూ అగర్వాల్, నేహా , వాసంతి కృష్ణన్, వర్షిణి , విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, నయనీపావని, శోభా శెట్టి, పద్మావతి, హర్ష సాయి, టేస్టీ తేజ, బండారు సుప్రీత, సన్నీ యాదవ్ , అమృతా చౌదరి తదితరుల పైన కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే.
వీరితోపాటు.. 19 బెట్టింగ్ యాప్ యజమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు 365, జంగిల్ రమ్మీ డాట్ కామ్ ఏ23 యోలో 247 ఫెయిర్ ప్లే తాజ్ 77, ధని బుక్ 365,పరి మ్యాచ్ ఇలా మొత్తంగా 19 బెట్టింగ్ యాప్స్ యజమానులపై కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరిగా సెలబ్రిటీలను విచారణ జరుపుతూ.. ఇక భవిష్యత్తులో బెట్టింగ్ యాప్స్ ను ఎవరు ప్రమోట్ చేయకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోబోతున్నారు.
