Begin typing your search above and press return to search.

రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం విజ‌య్ కు క‌లిసొచ్చేనా?

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అవ‌కాశాల ప‌రంగా ఎలాంటి ఢోకా లేక‌పోయినా విజ‌య్ కు స‌క్సెస్ మాత్రం ద‌క్క‌డం లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 Oct 2025 3:00 PM IST
రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం విజ‌య్ కు క‌లిసొచ్చేనా?
X

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అవ‌కాశాల ప‌రంగా ఎలాంటి ఢోకా లేక‌పోయినా విజ‌య్ కు స‌క్సెస్ మాత్రం ద‌క్క‌డం లేదు. ఏ సినిమాకు ఆ సినిమా కోసం విపరీతంగా క‌ష్ట‌ప‌డ‌టం, ఆ మూవీపై ఆశ‌లు పెట్టుకోవ‌డం, తీరా రిలీజ్ త‌ర్వాత అది విజ‌య్ కు నిరాశను మిగ‌ల్చ‌డం.. గ‌త కొన్ని సినిమాలుగా ఇదే జ‌రుగుతూ వ‌స్తుంది.

విజ‌య్ కు నిరాశను మిగిల్చిన కింగ్‌డ‌మ్

రీసెంట్ గా వ‌చ్చిన కింగ్‌డ‌మ్ సినిమా త‌న‌ కెరీర్లోనే ది బెస్ట్ గా నిలుస్తుంద‌నుకుంటే ఆ సినిమా కూడా విజ‌య్ కు అసంతృప్తినే మిగిల్చింది. దీంతో చేసేదేమీ లేక త‌ర్వాతి సినిమాల‌నైనా జాగ్ర‌త్త‌గా చేయాల‌ని మ‌రింత ఫోక‌స్ పెడుతున్నారు. కాగా విజ‌య్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి ట్యాక్సీవాలా డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా.

రాహుల్ సాంకృత్య‌న్ తో మ‌రోసారి

ఆల్రెడీ రాహుల్ తో సినిమాను మొద‌లుపెట్టిన విజ‌య్, దాంతో పాటూ మ‌రో సినిమాను కూడా మొద‌లుపెట్టాల‌ని చూస్తున్నార‌ట‌. కింగ్‌డ‌మ్ కోసం చాలా స‌మ‌యాన్ని వెచ్చించిన విజ‌య్, ఇక‌పై వేగంగా సినిమాల‌ను పూర్తి చేయాల‌నే ఉద్దేశంతో ఒకేసారి రెండు సినిమాల‌ను స‌మాంత‌రంగా చేయాల‌ని చూస్తున్నార‌ట‌. అందులో భాగంగానే ర‌వి కిర‌ణ్ కోలాతో సినిమాను మొద‌లుపెట్టనున్నారు విజ‌య్.

అక్టోబ‌ర్ రెండో వారంలో రవికిర‌ణ్ సినిమా

రాజా వారు రాణి గారు, అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమాల‌తో డైరెక్ట‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్న ర‌వి కిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. విజ‌య్ కెరీర్లో 15వ సినిమాగా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్టుకు దిల్ రాజు నిర్మాణం వ‌హించ‌నుండ‌గా, అక్టోబ‌ర్ రెండో వారంలో ఆ సినిమా లాంచ్ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీకి రౌడీ జ‌నార్థన అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఈ రెండు సినిమాలైనా విజ‌య్ కు కోరుకున్న స‌క్సెస్ ను అందిస్తాయేమో చూడాలి.