'ఇష్క్' సీక్వెల్ తీస్తాడా? విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌లో ఉత్సాహం!
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి విజయ్ దేవరకొండ స్వయంగా అధికారిక ప్రకటన చేశారు.
By: Sivaji Kontham | 17 Oct 2026 9:27 AM ISTయూత్ హీరో నితిన్, నిత్యామీనన్ జంటగా నటించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న `ఇష్క్` చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రేమకథా చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అందించిన అద్భుతమైన విజువల్స్, విక్రమ్ కె కుమార్ దర్శకత్వ పరిపక్వత ఈ సినిమాను ఒక అరుదైన క్లాసిక్‌గా మార్చాయి. నితిన్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్.. దర్శకుడిగా విక్రమ్ కె కుమార్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
`ఇష్క్`వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత, దర్శకుడు విక్రమ్ కె కుమార్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అదే తరహా క్యూట్ రొమాంటిక్ కామెడీ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సారి ఆయన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పని చేయడం చిత్ర పరిశ్రమలోనూ, సినీ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి విజయ్ దేవరకొండ స్వయంగా అధికారిక ప్రకటన చేశారు. ఇటీవలే జరిగిన `రణబాలి` సినిమా సక్సెస్ మీట్లో విజయ్ మాట్లాడుతూ.. విక్రమ్ కె కుమార్ తో ఒక క్యూట్ రొమాంటిక్ కామెడీ సినిమా చేయబోతున్నట్లు ధృవీకరించారు. విక్రమ్ అంతటి అద్భుతమైన స్క్రిప్ట్ తీసుకురావడం వల్లే ఈ సినిమా సాధ్యమవుతోందని..ప్రస్తుతం తాను చేస్తున్న ప్రతి సినిమాను ఎంతో ఇష్టపడి చేస్తున్నానని దేవరకొండ వెల్లడించారు. ఈ వార్తతో అతడి అభిమానుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇష్క్ సీక్వెల్ తీస్తాడా? అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు.
దర్శకుడు విక్రమ్ కె కుమార్ వైవిధ్యమైన కథాంశాలను తెరకెక్కించడంలో దిట్ట. అక్కినేని కుటుంబానికి తరం మారినా గుర్తుండిపోయే `మనం` వంటి క్లాసిక్ హిట్ అందించడమే కాకుండా.. అంతకుముందు ఆర్. మాధవన్‌తో `13 బి` వంటి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ను రూపొందించి తన మార్కును నిరూపించుకున్నారు. నాగచైతన్యతో థాంక్యూ ఒక వైవిధ్యమైన జానర్ సినిమా. విలక్షణమైన కాన్సెప్టులను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించడంలో అతడు ప్రత్యేక శైలిని కలిగి ఉన్నారు.
ఎంచుకున్న క్రాఫ్ట్స్ లో వైవిధ్యాన్ని చాటుతూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ - విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ కుదరడంతో ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. `ఇష్క్` లాంటి మనసును హత్తుకునే రొమాంటిక్ కథతో బ్లాక్ బస్టర్ అందించిన విక్రమ్ కె విజయ్ దేవరకొండ కోసం ఎలాంటి రొమాంటిక్ కథను ఎంపిక చేసాడో వేచి చూడాలి. వీడీ ఎనర్జిటిక్ నట ప్రదర్శనను విక్రమ్ కె కుమార్ ఎలా తెరపై ఆవిష్కరిస్తారో చూడాలని సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
