Begin typing your search above and press return to search.

దేవ‌ర‌కొండ కార్ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వాడు ప‌రారీ

తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో దేవ‌ర‌కొండ‌కు చెందిన లెక్సస్ కార్ కి స్వ‌ల్పంగా డ్యామేజ్ జ‌రిగింది.

By:  Sivaji Kontham   |   7 Oct 2025 9:46 AM IST
దేవ‌ర‌కొండ కార్ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వాడు ప‌రారీ
X

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కార్ ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో దేవ‌ర‌కొండ‌కు చెందిన లెక్సస్ కార్ కి స్వ‌ల్పంగా డ్యామేజ్ జ‌రిగింది. అయితే ఈ ప్ర‌మాదంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అత‌డి కుటుంబీకులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

అయితే వీడీ లగ్జరీ కారుకు ఎలాంటి డ్యామేజ్ జ‌రిగిందో చూపించే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ - పుట్టపర్తి నుండి హైదరాబాద్‌కు తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. త‌మ‌ కంటే ముందు వెళుతున్న కార్ అక‌స్మాత్తుగా కుడివైపు ట‌ర్న్ తీసుకోవ‌డంతో వెన‌క నుంచి వ‌స్తున్న దేవ‌ర‌కొండ కార్ దానిని ఢీకొట్టింది. లెక్సస్ LM 350h AWD కార్ స్వల్పంగా దెబ్బతింది. ఈ కార్ ధర రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని స‌మాచారం. అయితే దేవ‌ర‌కొండ కార్ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన మ‌హీంద్రా బొలెరో కార్ స్పాట్ లో ఆగ‌కుండా అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న అనంత‌రం దేవ‌ర‌కొండ స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ త‌న‌ స్నేహితుడి కారులో ఘ‌ట‌నా స్థ‌లి నుంచి హైద‌రాబాద్ కి వ‌చ్చేశారు.

కార్ ప్ర‌మాదం త‌ర్వాత దేవ‌ర‌కొండ హైద‌రాబాద్ కి చేరుకోగానే త‌న ఇన్ స్టాలో ఒక పోస్ట్ ద్వారా క్షేమ స‌మాచారాన్ని అందించారు. ఈ పోస్ట్ ప్ర‌కారం...''అంతా బాగానే ఉంది.. కారు దెబ్బతింది.. కానీ మేమంతా బాగానే ఉన్నాము. జిమ్ లో క‌స‌ర‌త్తులు కూడా చేసి ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను. నా తల నొప్పిగా ఉన్నా కానీ బిర్యానీ, నిద్ర బాగుండాలి. ..కాబట్టి మీ అంద‌రికీ నా హ‌గ్. ఈ వార్త మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయనివ్వకూడ‌దు'' అని ఆయన రాశారు. ఇటీవ‌లే ర‌ష్మిక మంద‌న్న‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రిలో ఈ జంట వివాహానికి సిద్ధ‌మ‌వుతోంది.