విజయ్ అప్పుడు లక్షల్లో.. ఇప్పుడు కోట్లలో..
2017లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో అతనికి విపరీతమైన స్టార్‌డమ్ వచ్చేసింది.
By: Sravani Lakshmi Srungarapu | 2 Aug 2025 7:00 PM ISTటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమా విజయ్ కు మంచి సక్సెస్ ను అందించింది. పెళ్లి చూపులు సినిమాలో పక్కింటబ్బాయి పాత్రలో ఒదిగిపోయిన విజయ్ రెండో సినిమాకు తనలోని ఫైర్ ను బయటపెట్టారు.
విజయ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా
2017లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో అతనికి విపరీతమైన స్టార్‌డమ్ వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కెరీర్ ను బాగా మలుపు తిప్పింది. అర్జున్ రెడ్డి మూవీతోనే విజయ్ కు రౌడీ హీరో అనే పేరు కూడా వచ్చింది. రూ.5 కోట్లతో తెరకెక్కిన అర్జున్ రెడ్డి రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేయడంతో పాటూ అర్జున్ రెడ్డి సినిమా రిలీజైన టైమ్ లో పెద్ద సెన్సేషన్ కూడా అయింది.
కింగ్‌డమ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్
రీసెంట్ గా విజయ్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్‌డమ్ అనే భారీ సినిమాలో నటించగా ఆ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ పాల్గొంటున్న అర్జున్ రెడ్డి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగానే అర్జున్ రెడ్డి సినిమాకు తాను తీసుకున్న రెమ్యూనరేషన్ ను కూడా వెల్లడించారు విజయ్.
అర్జున్ రెడ్డికి విజయ్ రెమ్యూనరేషన్..
అర్జున్ రెడ్డి సినిమాకు సందీప్ రెడ్డి వంగా తనకు రూ. 5 లక్షలు రెమ్యురేషన్ ఇచ్చాడని, సందీప్ ఆ సినిమా కోసం తన తండ్రి ఆస్తుల్ని తాకట్టు పెట్టి మరీ తీశాడని, అయినా అప్పట్లో రూ.5 లక్షలు అంటేనే తనకు చాలా ఎక్కువని చెప్పారు విజయ్. ఆ తర్వాత అర్జున్ రెడ్డికి వచ్చిన ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును వేలం వేస్తే రూ.25 లక్షలు వచ్చాయని, ఆ మొత్తాన్ని తాను సొసైటీకి ఇచ్చేశానని విజయ్ తెలిపారు. అప్పట్లో కేవలం రూ.5 లక్షలు తీసుకున్న విజయ్ ఇప్పుడు ఒక్కో సినిమాకు కొన్ని కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తున్నారంటే అతని క్రేజ్, మార్కెట్ ఏ రేంజులో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
