రోజుకు 300ml నీళ్లతో తీవ్ర నరకం చూసిన హీరో!
ఆ కఠినమైన సమయంలో ఐస్ క్యూబ్ నాకుతూ నిద్రపోయేటప్పుడు కూడా నీటి గురించే ఆలోచించేవాడినని విజయ్ తెలిపారు.
By: Srikanth Kontham | 4 Oct 2026 1:38 PM ISTవిజయ్ దేవరకొండ `రణబలి` కోసం ఎంతగా శ్రమించాడు అన్నది అతడి శారీరక రూపాంతరమే చెబుతుంది. అంతకు ముందు `లైగర్` సినిమాలో బాక్సర్ పాత్ర కోసం కూడా ఎంతో కష్టపడ్డాడు. కండలు తిరిగిన దేహం..సిక్స్ ప్యాక్ లుక్ కోసం ఎంతో శ్రమించి రింగ్ లోకి దిగాడు. కానీ ఆసినిమా ఫలితం తీవ్ర నిరాశనే మిగిల్చింది. కానీ చేసిన కష్ట వృద్దా పోదు అంటారు కదా? ఆ కష్టం `రణబాలి` కి చాలా వరకూ పనిచేసింది. మెలితిరిగిన కండలకు మరింత పదును పెట్టి `రణబాలి` కోసం రంగంలోకి దిగాడు. ఈ సందర్బంగా `లైగర్` సినిమా షూటింగ్ సమయంలో పాటిం చిన అనారోగ్యకరమైన డైట్ వివరాలను గుర్తు చేసుకున్నారు.
`లైగర్` చిత్రంలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పాత్ర కోసం శరీరాన్ని తగ్గించుకునే క్రమంలో ఎంతటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో వివరించారు. `లైగర్` షూటింగ్ సమయంలో నీటి వినియోగాన్ని క్రమంగా తగ్గించాల్సి వచ్చిందని విజయ్ వెల్లడించారు. షూటింగ్‌కు ముందు చివరి 10 గంటల సమయంలో అసలు నీళ్లే తాగకుండా కేవలం ఒక మంచు గడ్డను మాత్రమే నాకుతుండేవాడినని చెప్పారు. రోజుకు 300 మిలీలీటర్ల నీటితో గడుపుతూ ప్రతి క్షణం నీరు మాత్రమే కావాలనే తపనతో గడిపిన ఆ రోజులు ఆరోగ్యపరంగా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపాయని వ్యాఖ్యానించారు.
ఆ కఠినమైన సమయంలో ఐస్ క్యూబ్ నాకుతూ నిద్రపోయేటప్పుడు కూడా నీటి గురించే ఆలోచించేవాడినని విజయ్ తెలిపారు. ఇలా ఉండటం తన వల్ల కాదని భావించి ఆహారం ఏమీ వద్దని కేవలం నాలుగు లీటర్ల చల్లటి కొబ్బరి నీళ్లు తెప్పించమని టీమ్‌ను కోరేవాడినని గుర్తు చేసుకున్నారు. అంతలా శ్రమించి, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే మనసుకు తీవ్రమైన బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ దృష్టి అంతా తదుపరి చిత్రం `రణబలి`పైనే ఉంది. 19వ శతాబ్దపు దక్షిణ భారతదేశ నేపథ్యంతో, బ్రిటిష్ పాలన నాటి కరువు అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆంగ్లేయ కమిషనర్ సర్ థియోడోర్ హెక్టర్ (ఆర్నాల్డ్ వోస్లూ) క్రూరమైన పాలనకు వ్యతిరేకంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజల రక్షణ కోసం పోరాడే తిరుగుబాటుదారుడిగా విజయ్ చిత్రంలో అలరించనున్నారు. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.
