విజయ్ ను విచారించిన CID.. ఆ కేసులోనే..
తెలంగాణలో ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి.
By: M Prashanth | 11 Nov 2025 7:05 PM ISTఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో స్టార్ హీరో విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్, గేమింగ్ యాప్ ల ప్రమోషన్ పై దర్యాప్తు కొనసాగిస్తున్న తెలంగాణ సీఐడీ అధికారులు ఈరోజు (మంగళవారం) విజయ్ దేవరకొండను విచారించారు. తనపై జారీ చేసిన నోటీసు మేరకు ఆయన సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు.
విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఆయన నుండి సుమారు గంటకు పైగా స్టేట్ మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. సెక్యూరిటీ పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కార్యాలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండ విచారణ అనంతరం సీఐడీ ఆఫీసు వెనుక గేటు ద్వారా బయటకు వెళ్లిపోయారు.
తెలంగాణలో ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్ పరిధుల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్ లను ఇటీవల సీఐడీకి బదిలీ చేశారు. విచారణలో భాగంగా ఈ యాప్ లను ప్రమోట్ చేసిన ప్రముఖులపై అధికారులు దృష్టి సారించారు.
అందులో భాగంగానే హీరో విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కు కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ఇద్దరూ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయగా, విజయ్ దేవరకొండ ముందుగా విచారణకు హాజరయ్యారు.
గతంలో ఏ23 గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేసినందుకు విజయ్ దేవరకొండ పేరు కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 6న ఈడీ ఆయనను విచారించింది. ఆ యాప్ కంపెనీతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ వివరాలను అప్పట్లోనే సమర్పించినట్లు సమాచారం. సీఐడీ విచారణలో కూడా అదే అంశంపై ప్రశ్నలు వేశారని తెలుస్తోంది.
ఆ సమయంలో విజయ్ దేవరకొండ తాను కేవలం ప్రమోషన్ మాత్రమే చేశానని, ఆ యాప్ తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉండదని స్టేట్ మెంట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాక, ఇకపై తాను ఎలాంటి గేమింగ్, బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేయనని కూడా ఆయన అధికారుల ఎదుట స్పష్టం చేసినట్లు సమాచారం.
అయితే విచారణలో భాగంగా సీఐడీ సిట్ అధికారులు విజయ్ దేవరకొండను ఆయనకు ఆ యాప్‌ల ద్వారా అందిన పారితోషికం, కమీషన్ వంటి ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ ఫీజులు ఎవరికి చెల్లించారన్న అంశంపై కూడా వివరాలు కోరినట్లు సమాచారం. ఇప్పుడు సీఐడీ ఎదుట విజయ్ మరోసారి విచారణకు హాజరయ్యారు.
