తమిళనాడు CM విజయ్ కార్ గ్యారేజీ చెబుతున్న కఠిన నిజం!
విజయ్ ప్రయాణించిన బీఎమ్ డబ్ల్యూ ఐ-7 కారు సాంకేతికంగా అత్యంత ఆధునికమైనది. 2023లో భారత మార్కెట్లోకి విడుదలైన ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ధర సుమారు 2.05 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
By: Sivaji Kontham | 11 May 2026 1:36 PM ISTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో `తమిళగ వెట్రి కళగం` (టీవీకే) పార్టీని చారిత్రక విజయం దిశగా నడిపించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ ఇప్పుడు తన లగ్జరీ కార్ల కలెక్షన్‌తో వార్తల్లో నిలిచారు. ఇటీవల చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో భేటీ కావడానికి విజయ్ తన అధునాతన బీఎమ్ డబ్ల్యూ ఐ7 (BMW i7) ఎలక్ట్రిక్ సెడాన్ కార్లో విచ్చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. 2026 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఈ తొలి అధికారిక భేటీలో విజయ్ ఎంచుకున్న ఈ ఖరీదైన కారు.. ఆయన రాజకీయ ఇమేజ్‌లో ఆధునికతను, హుందాతనాన్ని ప్రతిబింబించింది.
విజయ్ ప్రయాణించిన బీఎమ్ డబ్ల్యూ ఐ-7 కారు సాంకేతికంగా అత్యంత ఆధునికమైనది. 2023లో భారత మార్కెట్లోకి విడుదలైన ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ధర సుమారు 2.05 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో 31.3 అంగుళాల రియర్ థియేటర్ స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. పర్యావరణ స్పృహతో కూడిన ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంచుకోవడం ద్వారా విజయ్ తన పరిపాలనలో కూడా ప్రగతిశీల.. పర్యావరణ హితమైన నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారనే సంకేతాలను ప్రజల్లోకి పంపినట్లయింది.
కేవలం బీఎమ్ డబ్ల్యూ మాత్రమే కాకుండా.. విజయ్ గ్యారేజీలో అద్భుతమైన కార్లు ఉన్నాయి. సుమారు 600 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన కొత్త సీఎం గ్యారేజీలో లెక్సస్ ఎల్ఎం 350హెచ్, టయోటా వెల్‌ఫైర్, బీఎమ్ డబ్ల్యూ 5 సిరీస్ వంటి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. గతంలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ కూడా ఉండేది. అదే సమయంలో.. సామాన్యులకు చేరువగా ఉండేలా ఆయన వద్ద మారుతి స్విఫ్ట్ వంటి సాధారణ కారు కూడా ఉండటం విశేషం. ఈ వైవిధ్యం అతడి వ్యక్తిత్వంలోని రెండు కోణాలను అంటే అగ్రశ్రేణి నాయకుడిగా- సామాన్యుల మనిషిగాను ప్రతిబింబిస్తుంది.
సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ మూడు దశాబ్దాల పాటు వెండితెరపై తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలారు. 2024లో సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి.. తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వంద్వాధిపత్యానికి తెరదించారు. అతడి అభిమాన సంఘాలే నేడు క్షేత్రస్థాయిలో బలమైన రాజకీయ సైన్యంగా మారి టీవీకే పార్టీని అతిపెద్ద శక్తిగా నిలబెట్టాయి. ఒక సామాన్య నటుడి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు విజయ్ సాగించిన ప్రయాణం అసాధారణమైనది.
విజయ్ తన కార్ల ఎంపిక ద్వారా కేవలం విలాసాన్ని మాత్రమే కాకుండా ఒక బలమైన రాజకీయ సందేశాన్ని కూడా ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం ద్వారా భవిష్యత్ తరాల విషయంలో తన బాధ్యతను చాటుకుంటూనే.. ఇంటి గ్యారేజీలో ఉన్న విభిన్న రకాల కార్ల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ఓటర్లను (అటు క్లాస్ నుండి ఇటు సామాన్యుల వరకు) ఆకట్టుకునే వ్యూహాన్ని అమలు చేసారు. వెండితెర `తలైవా` ఇప్పుడు రాజకీయాల్లో `ముఖ్యమంత్రి`గా తనదైన శైలిలో పాలనను పరుగులు తీయించడానికి సిద్ధమయ్యారు. అలాగే విజయ్ నటించిన జననాయగన్ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ రానుందని కూడా సమాచారం.
