క్లాస్ డైరెక్టర్‌తో బాలయ్య సినిమా.. అలా మిస్సయింది
బాలయ్యతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, లారీ డ్రైవర్ లాంటి మెగా హిట్లు ఇచ్చిన బి.గోపాల్ దగ్గరే విజయభాస్కర్ అసిస్టెంట్‌గా పని చేశాడు.
By: Garuda Media | 15 Oct 2025 9:00 PM ISTటాలీవుడ్ లెజెండరీ హీరోల్లో ఒకడైన నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని ఇండస్ట్రీలోకి వచ్చే దర్శకులందరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఏదైనా మాస్ సబ్జెక్ట్ ఉంటే ముందు గుర్తుకు వచ్చే హీరోల్లో బాలయ్య ఒకడు. ఐతే క్లాస్ దర్శకుడిగా పేరున్న విజయ భాస్కర్.. బాలయ్యతో ఒక సినిమా చేయాల్సిందట. బాలయ్య తనతో సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించినా.. తానే ఉపయోగించుకోలేకపోయానని విజయభాస్కర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
ప్రార్థన అనే ఫ్లాప్ మూవీతో విజయ భాస్కర్ కెరీర్ మొదలైనప్పటికీ.. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి చిత్రాలతో మామూలు విజయాలందుకోలేదు ఈ దర్శకుడు. జై చిరంజీవ నుంచి వరుస ఫ్లాపులు రావడంతో ఆయన తెరమరుగు అయిపోయారు. ఒకప్పటి టాప్ 4 స్టార్లలో ముగ్గురితో (చిరు, వెంకీ, నాగ్) సినిమాలు చేసిన విజయ భాస్కర్.. బాలయ్యతో సినిమా చేసే అవకాశం ఎలా మిస్ అయిందో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బాలయ్యతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, లారీ డ్రైవర్ లాంటి మెగా హిట్లు ఇచ్చిన బి.గోపాల్ దగ్గరే విజయభాస్కర్ అసిస్టెంట్‌గా పని చేశాడు. లారీ డ్రైవర్ కోసం పని చేస్తుండగా.. సురేష్‌తో ప్రార్థన సినిమా చేసే అవకాశం వచ్చిందట విజయ భాస్కర్‌కు. మధ్యలో వెళ్లి ఆ సినిమా పూర్తి చేసుకుని వచ్చిన భాస్కర్.. బాలయ్యకు ఆ సినిమాను చూపించాడట. చెన్నైలోని ఒక ప్రివ్యూ థియేటర్లో ప్రార్థన మూవీ చేసిన బాలయ్య చాలా ఇంప్రెస్ అయిపోయాడట. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే ఇంకా గొప్పగా సినిమా తయారయ్యేది అన్నాడట.
ఆ తర్వాత చాలా ఏళ్లకు మల్లీశ్వరి చేస్తుండగా.. బాలయ్యే ఫోన్ చేసి మనిద్దరం సినిమా చేద్దాం అని ఆఫర్ చేశాడట. తన తోడల్లుడు ప్రసాద్ నిర్మాణంలో సినిమా చేద్దామని అన్నాడట. ఐతే అప్పటికి మల్లీశ్వరి పూర్తి చేయాల్సి ఉండడం.. బాలయ్యకు సరిపోయే కథను సమయానికి సిద్ధం చేయకపోవడంతో ఆ చిత్రం పట్టాలెక్కలేదని విజయ భాస్కర్ తెలిపాడు. ఆ సమయానికి తన డేట్లు వేస్ట్ అయిపోతుండడంతో బాలయ్య.. జయంత్‌తో అల్లరి పిడుగు సినిమా చేశాడని.. అలా తాను గొప్ప అవకాశాన్ని కోల్పోయానని విజయ భాస్కర్ తెలిపాడు.
