తమిళ్ టూ తెలుగు.. బూతు టైటిల్ అవసరమా?
తమిళంలో సింపుల్‌గా లేదా బలంగా వినిపించే టైటిల్స్, తెలుగులోకి వచ్చేసరికి వింతగా లేదా ఎబ్బెట్టుగా అనిపించడం ఇంతకు ముందూ చూశాం. అయినా నిర్మాతలు కంటెంట్ ముఖ్యమని, టైటిల్ అంత ప్రాధాన్యం లేదని వాదిస్తుంటారు.
By: M Prashanth | 3 Sept 2025 8:33 AM ISTటాలీవుడ్‌లో తమిళ సినిమాలు డబ్ చేయడంలో టైటిల్స్ అప్పుడప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉంటాయి. చాలా కాలంగా ఇది కొనసాగుతున్న ట్రెండ్. అయితే మరికొన్ని టైటిల్స్ విషయంలో మాత్రం వివాదాలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. తమిళంలో సింపుల్‌గా లేదా బలంగా వినిపించే టైటిల్స్, తెలుగులోకి వచ్చేసరికి వింతగా లేదా ఎబ్బెట్టుగా అనిపించడం ఇంతకు ముందూ చూశాం. అయినా నిర్మాతలు కంటెంట్ ముఖ్యమని, టైటిల్ అంత ప్రాధాన్యం లేదని వాదిస్తుంటారు.
ప్రేక్షకులు కూడా కొంతవరకు ఈ ట్రెండ్‌కి అలవాటు పడ్డారు. కానీ ఇటీవల విజయ్ ఆంటోనీ ప్రొడ్యూస్ చేసిన కొత్త సినిమా మాత్రం టైటిల్ వల్లే పెద్ద చర్చకు దారి తీసింది. తమిళంలో సాదాసీదాగా ఉన్న ఆ టైటిల్, తెలుగులోకి రాగానే అసభ్య పదంగా మారిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఎందుకు ముందుగానే గుర్తించలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో విజయ్ ఆంటోనీకి మంచి క్రేజ్ ఉంది. బిచ్చగాడు సినిమాతో ఆయనకు సూపర్ హిట్ రావడంతో ఆ తర్వాతి సినిమాలకు కూడా ఇక్కడ బిజినెస్ దక్కింది. ఇంత పేరు సంపాదించిన స్థితిలో ఇలాంటి తప్పిదం జరగకూడదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ హీరోగా కాకుండా నిర్మాతగా ఉన్నా.. బాధ్యత ఆయన మీదే పడుతోందని చెబుతున్నారు.
ఇంతవరకు ప్రేక్షకులు తంగలాన్, తలైవీ, వలిమై లాంటి టైటిల్స్‌ని కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారు. కానీ అసభ్యార్థం వచ్చేలా ఉన్న టైటిల్ మాత్రం హద్దు మీరిందని ఫీలవుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వడంతో, టైటిల్స్‌ని రిలీజ్ చేసే ముందు కనీసం డబుల్ చెక్ చేయరా? అని ప్రశ్నిస్తున్న వారు ఎక్కువయ్యారు.
ప్రస్తుతం ఈ టైటిల్ వివాదం సినిమాకి అనవసరమైన నెగటివ్ హైప్ తెచ్చింది. కంటెంట్ బాగుంటే వసూళ్లకు హాని ఉండకపోవచ్చు కానీ ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే డబ్ సినిమాలపై ప్రేక్షకుల నమ్మకం దెబ్బతింటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి, తమిళం నుంచి నేరుగా టైటిల్ తీసుకోవడం అనేది తప్పుకాదని, కానీ ఆ టైటిల్ స్థానిక భాషలో ఎలాంటి అర్థం ఇస్తుందో తప్పనిసరిగా పరిశీలించాల్సిందేనని ఇప్పుడు చర్చ నడుస్తోంది. మరి ఈ వ్యవహారం విషయంలో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రమోషన్ లో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
