కోట్ల ఆస్తి ఉన్నా.. 4 వేలు ఖరీదు చేసే వాచ్ పెట్టుకోవడం వెనుక కారణం?
కూతురు మీరా మరణం తర్వాత విజయ్ ఆంటోనీ తన జీవితంలో కీలక మార్పులు చేసుకున్నారని భార్య ఫాతిమా వెల్లడించారు. మీరా ఉపయోగించకుండా వదిలేసిన చెప్పులను చూసి అప్పటి నుంచి చెప్పులు ధరించడం మానేశారని, ఆమె బహుమతిగా ఇచ్చిన రూ.4 వేల వాచ్నే ఇప్పటికీ ధరిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి.
By: Madhu Reddy | 19 Nov 2026 8:41 AM ISTసాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే వారు ఉపయోగించే వస్తువుల ఖరీదు ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వేసుకునే బట్టలను మొదలుకొని ధరించే చెప్పుల వరకు ప్రతిదీ కాస్ట్లీ గానే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక సెలబ్రిటీ మాత్రం కోట్ల ఆస్తి ఉన్నా.. నటుడిగా, గాయకుడిగా, ఎడిటర్ గా , గేయ రచయితగా, నిర్మాతగా , మ్యూజిక్ డైరెక్టర్గా ఇలా ఒక్కటేమిటి ఆయనలో ఎంతో ప్రతిభ ఉన్నా.. పైగా భారీగా సంపాదన కూడా ఉన్నా.. అవేవీ పట్టించుకోకుండా..ఇప్పటికీ కేవలం 4వేల రూపాయల విలువ చేసే వాచ్ పెట్టుకోవడం.. కాళ్లకు చెప్పులు లేకుండా తిరగడం లాంటివి చూస్తుంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. మరి ఆయన ఎవరు ? ఎందుకు అలా చేస్తున్నారు ? అసలేం జరిగింది? అనే విషయం వైరల్ గా మారుతుంది.
ఆయన ఎవరో కాదు ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ ఆంటోనీ. 2005లో సంగీత దర్శకుడిగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోని.. ఉత్తమ సంగీత విభాగంలో 'నాకముక్క' అనే పాట కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్ ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డ్ సృష్టించారు. ఈ పాట ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన. ఎన్నో చిత్రాలను తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా విడుదల చేసి మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక అలాంటి విజయ్ ఆంటోని తాజాగా అప్పాకుట్టి అనే సినిమాలో నటించాడు. ఈనెల 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఆడియో లాంచ్ నిర్వహించగా.. అందులో పాల్గొన్న విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా తన భర్త గురించి.. హృదయాన్ని ద్రవింప చేసే ఒక విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. విజయ్ కి పెద్దమ్మాయి మీరా అంటే చాలా ఇష్టం. అయితే మీరా సడన్గా అలా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జీవితంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆమె మరణం తర్వాత విజయ్ తన జీవితంలో ఎన్నో మార్పులు చేసుకున్నాడు.
ముఖ్యంగా మా కుమార్తె ఉపయోగించిన వస్తువులన్నీ కూడా తన గదిలో ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి. అయితే అందులో మీరా కోసం కొని , ఉపయోగించకుండా ఉండిపోయిన చెప్పులను చూసి విజయ్ ఇకపై జీవితంలో చెప్పులు ధరించకూడదని నిర్ణయించుకున్నాడు.
అంతేకాదు విజయ్ చేతికి గతంలో ఒక ఖరీదైన గడియారం ఉండేది. కానీ దాన్ని పక్కనపెట్టి మీరా కొనిచ్చిన రూ.4000 రూపాయల వాచ్ మాత్రమే ధరిస్తున్నాడు. మీరా లేకపోయినా విజయ్ మాత్రం ఇంకా మీరా జ్ఞాపకాలలోనే జీవిస్తున్నాడు అంటూ తమ కూతురు మరణం పై ఫాతిమా చేసిన కామెంట్లు అందరినీ దుఃఖానికి గురి చేస్తున్నాయి. ఇకపోతే విజయ్ ఫాతిమా దంపతులకు మరో అమ్మాయి ఉన్న విషయం తెలిసిందే. ఆ అమ్మాయి పేరు లారా. ఇక ఆమె లోనే తమ పెద్ద కూతురు మీరాని చూసుకుంటున్నామని తెలిపారు. ఇకపోతే విజయ్ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య మాత్రం సినీ సెలబ్రిటీలను, అభిమానులను కూడా మరింత దుఃఖానికి గురిచేసిందని చెప్పవచ్చు.
