ఆ చెత్త టైటిల్ మార్చేశారు.. ఇదే కొత్తది
గతంలో ఒరిజినల్ భాషలో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే, ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్ చేసేవారు, ఇప్పటికీ కొన్ని సినిమాలను అలాగే చేస్తున్నారు
By: Ramesh Palla | 8 Sept 2025 12:55 AM ISTఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాలు అనేవి సర్వ సాధారణం అయ్యాయి. గతంలో ఒరిజినల్ భాషలో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే, ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్ చేసేవారు, ఇప్పటికీ కొన్ని సినిమాలను అలాగే చేస్తున్నారు. కానీ ఎక్కువ శాతం సినిమాలు మాత్రం ఒరిజినల్ భాషతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ అవుతున్నాయి. ఒరిజినల్ భాషలో ఏ టైటిల్ అయితే ఉంటుందో అదే టైటిల్ ను డబ్బింగ్ వర్షన్‌కి పెడుతున్నారు. అందుకోసం ముందు నుంచే అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా, అన్ని భాషల్లో ఒకే అర్థం వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఎక్కుగా ఇంగ్లీష్ పదాలను లేదా క్యాచీగా ఉండే రెండు అక్షరాల టైటిల్స్‌ను వినియోగిస్తున్నారు. తాజాగా తమిళ్ నుంచి 'పూకి' అనే సినిమా రాబోతుంది. అదే టైటిల్ తో తెలుగులో విడుదల చేయాలని భావించారు.
బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోనీ
బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా కావడంతో తెలుగు లోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో తెలుగులోనూ పోస్టర్ విడుదల చేశారు. తమిళ్ పోస్టర్ విడుదల అయిన సమయంలోనే తెలుగు పోస్టర్‌ను విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ పూకి టైటిల్‌తో తెలుగు పోస్టర్‌ను రెడీ చేశారు. పూకి అనే పదంకు తెలుగు అర్థం ను తెలుసుకునే ప్రయత్నం వారు చేయకుండానే పోస్టర్స్ వేశారు. అలా పోస్టర్స్ వేయడంతో వివాదం మొదలు అయింది. ఇదేం చెత్త టైటిల్ అంటూ చాలా మంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పూకి అనే టైటిల్ విషయం లో వచ్చిన వ్యతిరేకత చిత్ర యూనిట్ సభ్యులకు వెళ్లడంతో టైటిల్‌నే మార్చేశారు.
బూతు టైటిల్‌ను మార్చి బుకీ గా కన్ఫర్మ్
పూకి అంటూ పెట్టిన టైటిల్‌ను విషయం తెలిసిన వెంటనే తొలగిస్తూ కొత్త టైటిల్‌గా బుకీ అంటూ కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా వెంటనే తెలుగు పోస్టర్‌ను విడుదల చేశారు. బుకీ పోస్టర్ వచ్చిన తర్వాత కూడా ఆ పాత పోస్టర్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఒక సినిమాకు టైటిల్ అనేది అత్యంత కీలకమైన విషయం. తమిళ్‌లో ఆ టైటిల్ ఉంటే తెలుగులోనూ అదే టైటిల్‌ను తీసుకు రావాలని అనుకోవడం తలతిక్క నిర్ణయం అని, ఆ నిర్ణయం వల్ల ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అని పలువురు మీడియా వర్గాల వారు, సోషల్ మీడియా జనాలు మాట్లాడుతున్నారు. ఒక భాష సినిమాను మరో భాష లోకి తీసుకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఆయా భాష తెలిసిన వారితో చర్చించాల్సిన మినిమం అవసరం ఉంది.
విజయ్ ఆంటోనీ నిర్మాణంలో బుకీ
విజయ్ ఆంటోనీ సినిమా అనగానే తెలుగు ప్రేక్షకుల్లో మినిమం బజ్ ఉంటుంది. అలాంటి విజయ్ ఆంటోని నిర్మించిన సినిమా అన్నా కూడా మినిమం బజ్ ఉంటుంది. అలాంటప్పుడు తెలుగులో పోస్టర్ విడుదల చేయాలి అనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాలన్నీ తెలుగులో మినిమం బజ్ తో విడుదల అవుతున్నాయి. బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలు ఇంకా కొన్ని సినిమాలతో తెలుగులో విజయ్ ఆంటోనీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగా సినిమాతో ఆకట్టుకుంటాడా అనేది చూడాలి. వచ్చే ఏడాదిలో విజయ్ ఆంటోనీ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా బుకీగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
