'బిచ్చగాడి' మరో ప్రయత్నం
శక్తి తిరుమగన్ సినిమాను తెలుగులో భద్రకాళి అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు.
By: Ramesh Palla | 13 Aug 2025 12:07 PM ISTతమిళ హీరో విజయ్ ఆంటోనీ ఫలితంతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే మార్గన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనీ త్వరలోనే 'శక్తి తిరుమగన్' సినిమాతో రాబోతున్నాడు. వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తమిళ్, తెలుగు రిలీజ్ డేట్ దాదాపుగా రెండు వారాలు ఆలస్యం కాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ 19న ఈ సినిమాను తెలుగు. తమిళ ప్రేక్షకుల ముందుకు ఒకేసారి తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
బిచ్చగాడు తర్వాత మరో విజయం
అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన శక్తి తిరుమగన్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా తమిళ్ ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్, స్పిరిట్ మీడియా సంస్థలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. బిచ్చగాడు తర్వాత తెలుగులో విజయ్ ఆంటోనికి ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని నిర్మాతలు చాలా బలంగా చెబుతున్నారు. బిచ్చగాడు 2 తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని విజయ్ ఆంటోనీ అందుకోలేక పోయాడు.
భద్రకాళి టైటిల్‌తో విజయ్ ఆంటోనీ
శక్తి తిరుమగన్ సినిమాను తెలుగులో భద్రకాళి అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. అవినీతి, అక్రమాలపై పోరాడే హీరో కథతో ఈ సినిమా రూపొందించారని తెలుస్తోంది. ఈ సినిమాకు ఎప్పటిలాగే సంగీతాన్ని విజయ్ ఆంటోనీ సంగీతాన్ని అందించాడు. అంతే కాకుండా ఈ సినిమాను విజయ్ ఆంటోనీ సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఈ సినిమా విజయ్ ఆంటోనీకి 25వ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతే కాకుండా దర్శకుడు అరుణ్ ప్రభు గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కమర్షియల్‌గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు దక్కించుకునే విధంగా ఆయన గత చిత్రాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి.
తెలుగులో సూపర్ హిట్ కోసం భద్రకాళి
విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి క్రేజ్ దక్కింది. తమిళ్‌లో ఆయన హీరోగా వచ్చిన సినిమాలు అన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి. ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకున్నా కూడా సాధ్యం అయినంత వరకు మంచి కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆకట్టుకునే కథ, కథనంతో విజయ్ ఆంటోనీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాను చేసి మెప్పించాడు అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. తెలుగులో బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలతో హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ భద్రకాళి సినిమాతో మెప్పించే అవకాశాలు ఉన్నాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
