Begin typing your search above and press return to search.

త‌ళా అజిత్ సార‌థ్యంలో రేసింగ్.. త‌మిళ యువ‌త‌కు ‍‍‍‍‍‍‍CM విజయ్ బంప‌రాఫ‌ర్?

తమిళ సినిమా రంగంలో తొలినాళ్లలో ప్రవేశించి... దశాబ్దాలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు దిగ్గజాలు ఇలయదళపతి విజయ్, అజిత్ కుమార్.

By:  Sivaji Kontham   |   13 Sept 2026 11:22 AM IST
త‌ళా అజిత్ సార‌థ్యంలో రేసింగ్.. త‌మిళ యువ‌త‌కు ‍‍‍‍‍‍‍CM విజయ్ బంప‌రాఫ‌ర్?
X

తమిళ సినిమా రంగంలో అటు విజయ్, ఇటు అజిత్ కుమార్ మధ్య ఉండే వైరం కేవలం ఆన్‌లైన్ ఫ్యాన్ వార్స్‌కే పరిమితమని... తెరవెనుక వారిద్దరూ మంచి స్నేహితులనే నిజానికి సిల్వర్‌స్టోన్ సర్క్యూట్ వేదిక మరోసారి సాక్ష్యంగా నిలిచింది. అభిమానుల మధ్య క్షణికావేశంతో జరిగే రచ్చ ఎంత ఉన్నా ఆ దిగ్గజ హీరోలు మాత్రం వ్యక్తిగత జీవితంలో ఒకరిపై ఒకరు గౌరవాభిమానాలు కలిగి ఉంటారనేందుకు ఈ కలయిక అద్దం పట్టింది.

తమిళ సినిమా రంగంలో తొలినాళ్లలో ప్రవేశించి... దశాబ్దాలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు దిగ్గజాలు ఇలయదళపతి విజయ్, అజిత్ కుమార్. వీరిద్దరూ సినిమాలకు భిన్నంగా తమ అభిరుచులను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అజిత్ కుమార్‌కు ఆటోమొబైల్ రేసింగ్ అంటే ఎంతటి ఇష్టమో అందరికీ తెలిసిందే. సినిమాలతో పాటు కార్ రేసింగ్‌లోనూ తన సత్తా చాటుతున్న ఆయన.. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై తమిళనాడు కీర్తిని చాటుతున్నారు.

ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో ఒక అరుదైన.. చారిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతమైంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సి. జోసెఫ్ విజయ్ అధికారిక పర్యటనలో భాగంగా సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ రేసింగ్‌లో పాల్గొంటున్న అజిత్ కుమార్‌ను విజయ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న క్షణాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారి... కోట్లాది మంది అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

60 ఏళ్ల వయసులోనూ `తళా` అజిత్ అంతర్జాతీయ రేసింగ్‌లో చూపుతున్న తెగువ... సాధిస్తున్న విజయాలు చూసి మాస్ యూత్ ఫ్యాన్స్ ఉప్పొంగుతున్నారు. రాష్ట్రంలోని చాలా మంది యువ ప్రతిభావంతులు కూడా ఫార్ములా వన్ రేసింగ్‌లో రాణించాలంటే ప్రభుత్వాల నుంచి తగిన అండదండలు ఉండాలని యువత కోరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ రంగంలో తమిళ యువత విస్తృతంగా రాణించేలా.. అజిత్ సారథ్యంలో ఫార్ములా రేసింగ్ అభివృద్ధికి సీఎం విజయ్ ప్రత్యేక నిధులు కేటాయిస్తూ తగిన ప్రోత్సాహం అందిస్తే బాగుంటుందనే చర్చ ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.

మొత్తంగా విజయ్, అజిత్ కుమార్‌ల ఈ కలయిక కేవలం ఇద్దరు స్నేహితుల కలయిక మాత్రమే కాదు... క్రీడాభివృద్ధికి రాజకీయ ప్రముఖులు చేయూతనిస్తే రాష్ట్ర యువత ఏ స్థాయిలో రాణించగలదో తెలిపే శుభసూచకం. ఈ చారిత్రాత్మక భేటీతో తమిళనాడులో మోటార్‌స్పోర్ట్స్ రంగానికి...యువ రేసర్లకు ప్రభుత్వ నిధులు.. సబ్సిడీల రూపంలో ఊతం లభిస్తుందనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.