'ఎవరేం చేసినా నా దగ్గర డబ్బులు లేవు'.. విఘ్నేష్ షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
By: M Prashanth | 16 April 2026 1:12 PM ISTకోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ఆ సినిమా ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయితే సినిమా ఫలితంపై దర్శకుడు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
రీసెంట్ గా ఒక కార్యక్రమంలో విఘ్నేష్ శివన్ ఓపెన్ గా మాట్లాడారు. "కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు నెగటివ్ పోస్టులు పెడుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే నా దగ్గర ఇప్పుడు డబ్బు ఏమీ లేదు. ఉన్నదంతా ఈ సినిమా కోసం ఖర్చు చేశాను. ఇంకా చాలా సెటిల్మెంట్లు మిగిలే ఉన్నాయి. ఈ వారం సినిమా బాగా ఆడకపోతే పరిస్థితి కష్టమే అవుతుంది" అని ఆయన తెలిపారు.
అదే సమయంలో హీరో ప్రదీప్ రంగనాథన్ మరో 100 కోట్ల విజయాన్ని నమోదు చేస్తాడనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. దీంతో అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా విఘ్నేష్ శివన్.. టైటిల్ మార్పు వెనుక స్టోరీ రివీల్ చేశారు.
నిజానికి.. సినిమాకు మొదట LIC అనే టైటిల్‌ను నిర్ణయించారు. అయితే, అదే పేరుతో ఉన్న భారత ప్రభుత్వ భీమా సంస్థ లైఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపింది. ఆ టైటిల్ ను వాడాలంటే భారీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో లీగల్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విఘ్నేష్ శివన్ టైటిల్ ను మార్చాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగా Company అనే పదాన్ని Kompanyగా మార్చి LIK అనే పేరును ఖరారు చేశారు. చిన్న మార్పుతో పెద్ద సమస్య నుంచి బయటపడటమే కాకుండా, టైటిల్ తో సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేశారు. అయితే భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న విడుదలైన ఆ చిత్రం ఫ్యూచరిస్టిక్ ప్రేమకథగా రూపొందింది.
2040 నేపథ్యంతో, టెక్నాలజీ ఆధారంగా ప్రేమను వెతికే అమ్మాయి, భావోద్వేగాలతో ప్రేమించే అబ్బాయి మధ్య జరిగే కథతో తెరకెక్కించారు. అయితే స్టోరీలో కొత్తదనం ఉన్నప్పటికీ, అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ పరంగా చూస్తే, తొలి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 39 కోట్ల వసూళ్లు సాధించింది. కానీ సినిమా బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుంటే, కలెక్షన్లు సరిపోవడం లేదని టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఆ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో, దర్శకుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిపై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి.
